చందుర్తి, జనవరి 29: చందుర్తి, జనవరి 29: చందుర్తికి చెందిన మేడికాల అంజయ్య మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు దృశ్య, శ్రవణ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తే సులభంగా అర్థమవుతుందనే ఆలోచనతో డిజిటల్ పాఠాలకు రూపకల్పన చేశారు. మూడేళ్లుగా తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దాదాపు 12 వరకు పాఠ్యాంశాలు రూపొందించారు.
ఈ పాఠ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీ -శాట్ చానల్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు టీచర్ ప్లానెట్ అనే చానల్ రూపొందించి, పాఠ్యాంశాలు పొందుపరిచారు. వీటిని ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. టీవీ, యూట్యూబ్ చానళ్ల ద్వారా బోధిస్తున్న అంజయ్యను పలువురు అభినందిస్తున్నారు. అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉత్తమ సేవలు అందిస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు తయారుచేసి విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు.
సహపాఠ్య కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చేస్తూ పర్యావరణం, హరితహారం, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్బ్యాగుల తయారీపై విద్యార్థులకు శిక్షణ అందించి, పేపర్ బ్యాగుల వాడకం వైపు విద్యార్థులను అలవాటు చేశారు. విద్యాశాఖ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తూ అధికారుల మన్నలను పొందుతున్నారు. అంజయ్య కృషికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా 20కి పైగా అవార్డులు అందుకున్నారు.
సాహిత్య సేవకుడు..
అంజయ్య తెలుగు భాషా సాహిత్య సేవకుడు. తన కవితలు, రచనలతో పాటు, తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులు రాసిన స్వీయ రచనలు, కవితలు, పేరడి పాటలను సాహితీ కిరణాలు అనే మాసపత్రికలో ప్రచురించి, విద్యార్థులకు రచనలపై ఆసక్తిని పెంపొందించి, వారిని బాల సాహిత్యంవైపు నడిపిస్తున్నారు. అనంతరం ప్రింటింగ్ ఖర్చుల భారంతో నిలిపివేశారు. తెలంగాణ సాహిత్య కళావేదిక అనే సాహితీ సంస్థను స్థాపించి అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో పాల్గొని, సాహిత్యం, కవితలు వినిపించడం ద్వారా పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. గతేడాది ప్రపంచ తెలుగు కవిత్వంలో రికార్డు ప్రదర్శనలో పాల్గొని కవితగానం చేసినందుకు భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు.
సాంకేతిక, వైజ్ఞానిక శోధకుడు
అంజయ్య బోధించేది తెలుగు భాషే అయినా తనకు సైన్స్‌పై ఉన్న మక్కువతో విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే వైజ్ఞానిక వేదికలకు, సైన్స్‌ఫేర్‌లలో పాల్గొనేలా కృషి చేస్తున్నారు. పలు ప్రాజెక్ట్‌లను విద్యార్థులతో రూపొందించి, గైడ్ టీచర్‌గా వ్యవహరించారు. అంజయ్య ఆవిష్కరించిన ఆటోమేటిక్ కంట్రోల్ పరికరం గది ఉష్ణోగ్రతను నియంత్రించి, పేదవాడి ఏసీ మాదిరిగా పనిచేస్తున్నది. అలాగే విద్యుత్‌ను ఆదా చేస్తుంది. దీనికి గాను పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం చేతుల మీదగా ‘ఇన్వెంటర్’ అవార్డు అందుకున్నారు.