Raghavapur | పెద్దపల్లి రూరల్ ఫిబ్రవరి 3 : అర్హులైన పేదలకు రాఘవాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాఘవాపూర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కల్లెపెల్లి అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తైనప్పటికీ ఇప్పటివరకు రాఘవాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయమన్నారు. రాఘవాపూర్ గ్రామ ప్రజలపైన ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తున్నట్లుందన్నారు.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి రాఘవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా ముగ్గు పోయకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందో అర్థమౌతుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. గ్రామంలో అనేకమంది సొంత ఇండ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వమైనా ఇండ్లు నిర్మించి పేదవారి సొంత ఇంటి కల తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
వెంటనే రాఘవాపూర్ లో ఇండ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ లు ఇవ్వాలని, లేకుంటే నిరుపేద కుటుంబాలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మోదంపల్లి శ్రావణ్, కుమ్మరి నవీన్, కుమ్మరి శ్రీశైలం, గ్రామస్థులు ఎంజాల కుమార్, కనకయ్య, పర్వతాలు, శ్రీనివాస్, స్వప్న, దిలీప్, సదయ్య, ఎల్లయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు.