సిరిసిల్లలో ఇందిరా స్వశక్తి చీరెల ఉత్పత్తి నత్తనడకన సాగుతున్నది. బతుకమ్మ చీరెలు బంద్ కావడంతో ఇక్కడ ఉపాధి కోల్పోయిన నేతన్నలకు మళ్లీ వలసబాటే దిక్కయింది. సర్కారు ఇచ్చిన చీరెల ఆర్డర్లు ఆలస్యం కావడంతో కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో తయారీ నత్తనడకన సాగుతున్నది. 4.30 కోట్ల మీటర్ల ఆర్డర్లకు ఇప్పటి వరకు 1.83 కోట్ల మీటర్లే తయారైంది. ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని టెస్కో గడువు విధించగా, గడువులోగా లక్ష్యం పూర్తవుతుందా.. లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రాజన్న సిరిసిల్ల, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిచ్చి అండగా నిలిచింది. తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా ఏటా చీరెలను అందించింది. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆరుకోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లను ఇస్తూ వచ్చింది.
బతుకమ్మ చీరెలతో భరోసానివ్వడంతో ఉమ్మడి రాష్ట్రంలో పనిలేక సూరత్, ముంబై, భీవండి, దుబాయికి వలస పోయిన కార్మికులంతా స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, బిహార్, ఒడిశా రాష్ర్టాల నుంచి కూడా వందల సంఖ్యలో వలస వచ్చిన కార్మికులకు సిరిసిల్లలో బతుకు దెరువు పొందారు. ఒక్కో కార్మికుడు నెలకు 20 వేల నుంచి 25 వేల వరకు సంపాదించారు. కేవలం కూలీ మాత్రమే కాకుండా చీరెల తయారీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం యారన్ సైతం సబ్సిడీ ఇచ్చింది. వాటి నగదు నేరుగా నేతన్నల ఖాతాల్లో జమ చేసింది.
చేతి నిండా పని కల్పించడమే కాకుండా వచ్చిన కూలీ డబ్బులను పొదుపు చేసుకునేందుకు త్రిఫ్ట్, నేతన్నకు బీమా, పింఛన్ ఇచ్చింది. యజమానులు, ఆసాములకు మరమగ్గాల ఆధునీకరణ కోసం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఉపాధి చూపిన బతుకమ్మ చీరెల పంపిణీ బంద్ చేసింది. దీంతో ఏడాది కాలంగా పనిలేక కుటుంబ పోషణ భారమై కొంత మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఎందరో మళ్లీ వలసబాట పట్టారు. తర్వాత కార్మిక సంఘాల ఒత్తిడితో దిగొచ్చిన ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత చీరెల తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. స్వశక్తి సంఘ సభ్యులైన 67 లక్షల మంది మహిళలకు రెండు జతల చీరెలు ఇవ్వాలని నిర్ణయించి, ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. అప్పటికే చాలా మంది కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు చీరెలు తయారు చేసే కార్మికులు కరువయ్యారు.
ఆర్డర్లు ఇవ్వడంలో జాప్యం
ఇందిరమ్మ మహిళా శక్తి చీరెల ఆర్డర్లు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. సిరిసిల్లలో దాదాపు 40 వేల మరమగ్గాలున్నాయి. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, చీరెల ఆర్డర్లు ఆలస్యంగా రావడంతో చాలా మంది కార్మికులు పొట్ట చేతపట్టుకుని తిరిగి ఆయా రాష్ర్టాలకు వలస వెళ్లారు. ఫలితంగా సిరిసిల్లలో కార్మికుల కొరత తీవ్రమైంది. 40 వేల సాంచాలలో 16 వేల సాంచాలు మాత్రమే నడుస్తున్నాయి. అందులో 7300 సాంచాలపైనే ఇందిర శక్తి చీరెలు తయారవుతున్నాయి.
జనవరిలో ఇవ్వాల్సిన ఆర్డర్లు మార్చిలో ఇచ్చారు. 67 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకు చీరెలు ఇవ్వాల్సి ఉంది. రెండు దశలలో ఆర్డర్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. మొదటి విడుతలో 4.30 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా ఈ లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు కోటి 82 లక్షల 50వేల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. గతంలో బతుకమ్మ చీరెలు రోజుకు పది లక్షల మీటర్లు ఉత్పత్తి జరిగింది. ఇందిరమ్మ శక్తి చీరెలు రోజుకు నాలుగు లక్షల మీటర్లే తయారవుతున్నది. అందుకు కారణం కార్మికుల కొరతనేనని స్పష్టమవుతున్నది.
ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వక నాన్చుడు ధోరణి అవలంభించడంతో సిరిసిల్ల వీడిపోయిన కార్మికులు తిరిగి రాలేదు. చేతి నిండా పని నిరంతరం ఉంటుందా.. లేదా? అన్న అనుమానాలే నేతన్నలను వెంటాడుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు వచ్చేనెల గడువు విధించింది. మెదటి దశలో ఇచ్చిన ఆర్డర్లు పూర్తి చేస్తేనే రెండో దశ ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పారు. కార్మికులు లేరు, పైగా కరెంటు కోతలు తప్పడం లేదని, టార్గెట్ ఎలా? సాధ్యమవుతుందని నేతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.