Female compound archer Chikita | పెద్దపల్లి, ఆగస్టు 30 : కెనడా వేదికగా జరిగిన విన్ని పెగ్ -2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20ఏళ్ల వయసు గల తానిపర్తి చికిత భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించడం యావత్తు భారత దేశానికి గర్వ కారణమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో తన చాంబర్లో ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితను శనివారం సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలోఅగ్రశ్రేణి క్రీడాకారులను మట్టి కరిపించి స్వర్ణ విజేతగా నిలిచి భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్‌గా నిలిచిందన్నారు. విలువిద్య క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు.
భవిష్యత్తులో ఒలంపిక్స్‌లో కూడా రాణించి భారత దేశానికి, పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని అకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్త్యాల రవీందర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ అమెరిశెట్టి తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చికితకు అభినందలు తెలిపిన మాజీ గవర్నర్
వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీలో స్వర్ణ పతాకం సాధించిన తానిపర్తి చికితాకు టెలిఫోన్ ద్వారా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. తెలంగాణ ముద్దు బిడ్డ, పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికితా కెనడా వేదికగా జరిగిన విన్నిపెగ్ 2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీలో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20 ఏళ్ళ చిరుప్రాయంలోనే స్వర్ణ విజేతగా నిలువటం దేశానికే గర్వకారణమని చికిత ప్రతిభను కొనియాడారు.