పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కారు పాఠశాలలు, ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండగా, అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. రేకులున్న చోట పగిలి, ఉరిసేందుకు సిద్ధంగా ఉంటే, కొన్ని స్లాబులు నెర్రలుబారి, పెల్లులు ఊడిపడ్తున్నాయి. ఫ్యాన్లు వంకర్లు తిరిగి అక్కరకు రాకుండా పోగా.. తరగతి గదులు, వంటశాలలు అధ్వానంగా మారాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహణ లేక మూలనపడి పోయాయి. ఎంత వేగిర పడినా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఆధునీకరణ పనులు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 14.19 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేకపోయాయి. మరోవైపు ఉపాధ్యాయుల కొరత కూడా కనిపిస్తుండగా.. ఇప్పటికే పాఠశాలలకు చేరాల్సిన పాఠ్య పుస్తకాలు ఎంఆర్సీ భవనాలకే పరిమితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఆయా పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకాల్సి వస్తున్నది.
కరీంనగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ)/కమాన్‌చౌరస్తా : అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ ‘మన బస్తీ -మన బడి’ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరిట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా.. ఆచరణలో మాత్రం ప్రగతి అంతంతే ఉన్నది. ప్రభుత్వం ఎంత వేగిర పర్చినా పనుల్లో 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 698 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ‘మన ఊరు -మన బడి’ ‘మన బస్తీ -మన బడి’ కింద గత ప్రభుత్వం 230 పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో 40 పాఠశాలలను పైలెట్‌గా ఎంపిక చేసి వాటిలో పనులు పూర్తి చేసింది. మిగతా పాఠశాలల్లో మిగిలిన పనుల గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరిట ఇదే కాన్సెప్ట్‌తో కొత్త పథకాన్ని తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం 345 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 14.19 కోట్లు వెచ్చించింది. ఈ నిధుల నుంచి మొదట 50 శాతం విడుదల చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వగా, రెండో విడుతగా మరో 25 శాతం నిధులు ఇచ్చింది. పనులు పూర్తయిన తర్వాత మిగతా 25 శాతం నిధులు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పటి వరకు మొదటి విడుత నిధులతో చేపట్టిన పనుల్లో 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దుస్థితే ఉన్నట్టు తెలుస్తున్నది.
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరాల్సి ఉన్నది. కానీ, వచ్చిన కొన్ని పాఠ్యపుస్తకాలు కూడా మండల రిసోర్స్ కేంద్రాల్లోని కనిపిస్తున్నాయి. వీటిని స్కూల్ పాయింట్ వరకు సరఫరా చేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలున్నట్లు ఆయా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు చెబుతుండగా, ఎంఆర్సీ భవనాల నుంచి ఆయా పాఠశాలల హెచ్ఎంలే తీసుకెళ్లాలని విద్యాధికారులు చెబుతున్నారు. నిజానికి కరీంనగర్ జిల్లాలోని 698 పాఠశాలల్లో 62,251 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో ఉన్నారు. వీరికి 4,66,644 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తున్నది. మిగతావి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఈ పుస్తకాలను స్కూల్ పాయింట్ వరకు ఎవరు చేరుస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరో పక్క ఉపాధ్యాయుల కొరత కూడా పాఠశాలలను వేధిస్తున్నది. కరీంనగర్ జిల్లాలో 492 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికితోడు గత అక్టోబర్‌లో జరిగిన బదిలీల్లో రిలీవర్లు లేక ఇప్పటి వరకు పూర్వ స్థానాల్లోనే ఉన్న ఉపాధ్యాయులు ఈ సెలవుల్లో తమకు బదిలీ అయిన పాఠశాలల్లో విధుల్లో చేరుతున్నారు. వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్ వంటి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో రిలీవర్ ఉపాధ్యాయులు రాకముందే ఆయా పాఠశాలల నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులు వెళ్లి పోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో 50 శాతం ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పోస్టులను భర్తీ చేయాలంటే పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పదోన్నతుల ప్రక్రియ మొదలవగా, ఎలాంటి ఆటంకాలు లేకుంటే వారం పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కానీ, పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటనేది సందేహంగా ఉన్నది. ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లు తెలుస్తున్నది. విద్యా వలంటీర్లతో హైస్కూళ్లలో పాఠాలు ఎలా చెప్పిస్తారనేది మరో సందేహం.
కరీంనగరంలోని పలు పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నా ఉన్నతాధికారులు అక్కడ జరిగే పనులను పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. గంజ్ హైస్కూల్లో శిథిలమైన భవనాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉన్నా ఆ పనులు చేయించలేదు. అలాగే, బాలబాలికలకు బాత్రూంల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాత బైపాస్‌లోని దుర్గమ్మగడ్డ హైస్కూల్ భవనం పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. నవంబర్ నుంచి ఆ పనులను కాంట్రాక్టర్ చేపట్టడంలేదు. అయితే, ఆ పాఠశాల ప్రస్తుతం వసతులు లేని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు.
ఈ విషయంలో ప్రిన్సిపాల్‌తో మాట్లాడగా, నవంబర్ నుంచి కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని, ఇప్పటికే చాలా డబ్బు పెట్టుబడి పెట్టామని, బిల్లులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారని సమాధానం ఇచ్చారు. అక్కడే ఉన్న అశోక్‌నగర్ ఉర్దూ మీడియం స్కూల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఆ పాఠశాలకు మూడు గదులు ఉండగా ఒక గది తలుపులు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. నగరంలోని కార్ఖానగడ్డ హైస్కూల్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
ఈ పాఠశాలలో ప్రతి విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు నిండిపోతున్నాయి. ఆ పాఠశాలలోనే ప్రైమరీ, హైస్కూల్, అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వసతులు లేక కొత్త అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పాఠశాలలో బోరు కూడా పనిచేయడం లేదు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పూర్తిగా విరిగిపోయి కనిపిస్తున్నాయి. మూత్ర శాలలకు నీటి వసతి లేదు. విద్యార్థులు వాడితే దుర్గంధం వ్యాపించే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలలో దాదాపు 400 మంది, ప్రైమరీ పాఠశాలలో మరో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఏ పథకాన్ని ప్రభుత్వం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలకు డైనింగ్ హాల్ మంజూరైనా దానిని నిర్మించేందుకు స్థలం లేని పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్న ఇలాంటి పాఠశాలలను విస్మరించి, విద్యార్థులు లేని పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 19వ వరకు బడిబాట కార్యక్రమాలల్లో విద్యార్థులను కూడా భాగస్వాములు చేయాలని, ఆ లోగా సరిపడా పుస్తకాలు, యూనిఫాం అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే, వేసవి సెలవుల ప్రారంభం నుంచే అసౌకర్యాలు ఉన్న పాఠశాలలల్లో సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసి, పలు పనులు చేయించాలని నిర్ణయించారు. అందులో కోసం అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పనులన్నీ నామమాత్రంగానే నడుస్తున్నాయి. ఈ విషయంలో కరీంనగర్ కలెక్టర్ సైతం పలుసార్లు అధికారులను ఆదేశించినా, పాఠశాలలను పరిశీలించినా, పాఠశాలలు తెరుచుకునే రోజు వరకు పనులు పూర్తికాని పరిస్థితి ఉన్నది.
గతంలో ప్రభుత్వ పాఠశాలలు 9.30 గంటల నుంచి ప్రాంరంభమయ్యేవి. కానీ, ఈ సంవత్సరం నుంచి ఉదయం 9 గంటలకు పాఠశాలల్లో విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 9.30 నుంచి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలు 8.30 గంటలకు ప్రారంభవుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చిన్నచూపు వస్తున్నదని గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ ఈ నెల 19 వరకు బడి బాట నిర్వహించాలని ప్రభుత్వ పరమైన ఆదేశాలు ఉన్నాయి.