Singareni | రామగిరి, సెప్టెంబర్ 25: సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఆర్జీ-3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు) వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. ఆర్జీ 3లోని ఓసీపీ-1, ఓసీపీ-2 గనుల్లో భారీ ఎక్స్కవేటర్లు, డంపర్లు ఎక్కడైతే పని స్థలం వద్దనే నిలిచినట్లు వర్షం నిరంతరంగా కురుస్తుండంతో పనులు తిరిగి ప్రారంభించడం కష్టమని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోతుందన్నారు. వర్షం కొనసాగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు సింగరేణి ఉన్నతాధికారులు గనులను సందర్శించి, చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, వచ్చే 24 గంటల్లో కూడా ఈ ప్రాంతంలో మధ్యస్థ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యంత్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యల చేపట్టామని అధికారులు తెలిపారు.