కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 18: కరీంనగర్ ఐటీఐ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌డే నేపథ్యంలో ‘సేవా పక్వాడా’ పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా కరీంనగర్ ఐటీఐ కళాశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఆర్, వీఆర్ (అగ్ మెంటెడ్ రియాలిటీ, వీడియో వర్చువల్ రియాలిటీ) ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఇది పైలెట్ ప్రాజెక్టు మాత్రమే.. పూర్తిస్థాయిలో ల్యాబ్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కరీంనగర్ ఐటీఐ కళాశాలలో చదువుకున్నామని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రతి విద్యార్థి చేరాలన్నారు. టెక్నాలజీని అప్డేట్ చేసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏఆర్ వీఆర్ ల్యాబ్‌ను పైలెట్ పద్ధతిలో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది గానీ.. ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. వాష్‌రూమ్‌కు ఇబ్బందిగా ఉందని, కిటికీలు దెబ్బతిన్నాయని విద్యార్థులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లగా, కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.