మెట్ట రైతు జీవితం ఆగమవుతున్నది. వానకాలం సేద్యం కన్నీరు తెప్పిస్తున్నది. ఎల్‌నినో ప్రభావంతో అటు వర్షాలు పడక, ఇటు కాలువల్లో నీళ్లు పారక సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో బంగారు పంటలు పండించిన కర్షకులు, ఇప్పుడు వానకాలంలోనే మొగులుకేసి ఆశగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ‘కాళేశ్వరం’ వద్ద వృథాగా పోతున్న జలాలను ఎత్తిపోయాల్సిన కాంగ్రెస్ సర్కారు, పూర్తి నిర్లక్ష్యం చేస్తుండడంతో రిజర్వాయర్లు అడుగంటుతుండగా, రాజన్న సిరిసిల్లలో సాగు నీటి కటకట తీవ్రమైంది. నారుమడులు, నాటేసిన పొలాలు, పత్తి చేన్లు ఎండిపోతుండగా, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంప్‌హౌస్‌లలో నీటిని ఎత్తిపోయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, జూలై 9(నమస్తే తెలంగాణ) : మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నివో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో ఎవుసం ఆగమవుతున్నది. సాగుకు నీళ్లు లేక రైతాంగం కుదేలవుతున్నది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా అడపాదడపా రెండు, మూడు వానలు తప్ప ఇప్పటి వరకు భారీ వర్షం పడిందే లేదు. మరోవైపు శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్ట్ (మిడ్ మానేరు), ఎగువ మానేరు, అన్నపూర్ణ, మల్కపేట రిజర్వాయర్లలో నీరు లేక ప్రమాద ఘంటికలు మోగుతుండగా, పంటల సాగుపై రైతులు దిగులు చెందుతున్నారు.
వానకోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూ కంటతడి పెడుతున్నారు. మానేరు, మూలవాగుతో పాటు జిల్లాలో సుమారు 625 వరకు చెరువులు ఉండగా, వర్షాభావ పరిస్థితులతో అడుగంటే పరిస్థితికి చేరిపోయాయి. మరోవైపు బోరుబావులు, వ్యవసాయబావుల్లో నీరు అంతంతమాత్రంగానే ఉండగా, అవి ఎత్తిపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. నారుమడులు, ఇప్పటికే నాటేసిన పొలాలు నీరందక, మరోవైపు పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల ట్యాంకర్ల ద్వారా నీరందించుకుంటూ సాగును గట్టేక్కించేందుకు ప్రాజెక్ట్‌లు నింపితేనే నీళ్లు..జిల్లాలో 27 టీఎంసీల సామర్థ్యం గల మధ్య మానేరు ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.47 టీఎంసీలే నిల్వ ఉండగా, అది మిషన్ భగీరథ అవసరాల కోసమే సరిపోతుంది.
ఈ రిజర్వాయర్ నుంచి మల్కపేట రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే, పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో నందిమేడారం నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడం, దిగువన కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లో నీరున్నా ఎత్తిపోయకపోవడంతో మధ్యమానేరులో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతుండగా, సాగుకు విడుదల చేసే అవకాశమే లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపితేనే వానకాలం సాగు సాఫీగా సాగుతుంది. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని పంప్‌లను ఆన్‌చేసి వృథాగా పోతున్న జలాలను ఎత్తిపోసి ప్రాజెక్ట్‌లను నింపి నీరందించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో 2.48లక్షల విస్తీర్ణంలో సాగు
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 2.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 1.80 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని లెక్కగట్టగా, ఇప్పటివరకు 4025 ఎకరాల్లో సాగు చేశారు. 48296 ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా, ఇప్పటి వరకు 46,200 ఎకరాల్లో విత్తనాలు వేశారు. మక్క 2వేల ఎకరాల్లో అంచనా వేయగా, ఇప్పటి వరకు 1145 ఎకరాల్లో వేశారు. కందులు 1200 ఎకరాల అంచనా వేయగా, ఇప్పటి వరకు 180 ఎకరాల్లోనే వేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు పెసర, ఆయిల్ పాం ఇతర పంటలను సైతం సాగు చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో మెట్ట రైతు సంబురం
స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ హయాంలో సాగు నీటికి ఏ ఢోకా లేకుండా మెట్ట రైతు సంబురంగా బతికాడు. ప్రభుత్వం కొలువుదీరగానే శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తి చేసి సాగును సస్యశ్యామలం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎస్ఆర్ఆర్ను నింపి పుష్కలంగా నీరందించారు. కాళేశ్వరంలో భాగంగా మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లను సైతం నిర్మించి, గోదావరి జలాలను మధ్యమానేరు మీదుగా రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్‌కు తరలించి, మండుటెండల్లో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. మూలమూలకూ గోదారి జలాలను తరలించి బీడు భూములను వినియోగంలోకి తెచ్చి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. పదేండ్లపాటు రైతుకు ఏలోటూ లేకుండా చూశారు. ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ కొలువుదీరడంతో రైతుకు కష్టం వచ్చిపడింది. ప్రాజెక్టులను గాలికొదిలేయడం, కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, నీటిని ఎత్తిపోయకపోవడం, మరోవైపు వర్షాభావ పరిస్థితులతో సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు.