చెరువుల్లో మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్తున్నాయి. ఒక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, నిత్యం వందలాది టిప్పర్లలో పరిమితికి మించి తరలించుకుపోతున్నాయి. ఇక పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మట్టికి కొంత మొత్తంలో ఫైన్ తీసుకొని మళ్లీ పరిష్మన్ ఇవ్వడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి కలెక్టర్ కొత్త మట్టి పాలసీ తీసుకువచ్చినా.. తాజాగా రాఘవాపూర్‌లో సీజ్ చేసిన మట్టికి తక్కువ మొత్తంలో జరిమానాతో పాత విధానంలో అనుమతులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపల్లి, మే 7 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఇటుక బట్టీలు విస్తరించి ఉండడంతో మట్టికి భారీ డిమాండ్ ఉంటుంది. ఏటా వేసవిలో చెరువులు ఎండిన వెంటనే పలువురు ఇటుక బట్టీల వ్యాపారులు మాఫియా అవతారం ఎత్తుతున్నారు. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మామూళ్ల మత్తులో ఉంచి, పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి చెరువుల్లోని మట్టి తరలింపు కోసం ఇటుక బట్టీ వ్యాపారులు కమర్షియల్‌గా రాయల్టీ చెల్లించి సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుంటారు.
ఆయా చెరువుల నుంచి కేటాయించిన వరకే మట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా తాను అనుమతి తీసుకున్న బట్టికి మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తరలించుకోవాల్సి ఉంటుంది. అయితే అనుమతి తీసుకున్నామనే పేరిట బట్టీల నిర్వాహకులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో బట్టీలకు యథేచ్ఛగా తోడుకెళ్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనిపై పకడ్బందీగా నిఘా పెట్టాల్సిన ఆయా శాఖల అధికారులు చోద్యం చూస్తుండడంపై ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తూ, అనుమతులు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
గతేడాది పెద్దపల్లి డివిజన్ పరిధిలో మట్టితీతకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పెద్దపల్లి మండలంలోని ఇటుక బట్టీల యజమానులు రామగుండం మండలంలోని ముర్మూరు, మంథని మండలంలోని బిట్టుపల్లి చెరువుల నుంచి మట్టి తరలించారు. అనుమతులు గోరంత తీసుకొని కొండంత రవాణా చేశారనే విమర్శలున్నాయి. అధికారులు మట్టిని సీజ్ చేయగా, కొద్దిరోజుల తర్వాత కొంత మొత్తంలో జరిమానా చెల్లించి ఇటుక బట్టీలకు తరలించుకుపోయారు.
ఇక రెండు, మూడేళ్ల క్రితం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ చెరువులోనూ ఇలాగే అనుమతి తీసుకున్నది గోరంత అయితే.. కొండంత తవ్వడం, విమర్శలు రావడంతో అధికారులు మట్టిని సీజ్ చేశారు. మరో ఘటనలో రెండేండ్ల క్రితం పెద్దపల్లి మండలం కొత్తపల్లి చెరువులో అనుమతికి మించి మట్టిని తవ్వడంతో అధికారులు సీజ్ చేశారు. ఈ మూడు ఘటనల్లో సీజ్ చేసిన మట్టికి స్వల్పమైన జరిమానాలు తీసుకొని ఈ ఏడాది తిరిగి మట్టిని తరలింపును ఇవ్వడం అనేక విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు అనుమతులు ఇచ్చారనే విమర్శలున్నాయి.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ చెరువులో 2023లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వారు. అంతకుముందు చెరువు మట్టి తీతకు రాఘవాపూర్‌లోని మణితేజ బ్రిక్స్ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఎలాంటి అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున మట్టిని తోడారు. అప్పుడే అత్యధికంగా తరలించగా, వేలాది మెట్రిక్ టన్నుల మట్టిని ఒక చోట నిల్వ చేశారు.
ఫిర్యాదులు రావడంతో అధికారులు వెళ్లి పరిశీలించారు. 19,361మెట్రిక్ టన్నులు ఉన్నట్టు గుర్తించి, సీజ్ చేశారు. అయితే ఈ గుర్తింపులోనూ అవకతవకలు జరిగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పెద్దపల్లి డివిజన్లో నుంచి మట్టి, ఇసుక తరలింపునకు అధికారులు అనుమతులు ఇవ్వబోమని చెప్పడంతో సీజ్ చేసిన మట్టి అలాగే ఉండిపోయింది. కానీ, ఇటీవల ఆ మట్టికి తక్కువగా 7,74,440 జరిమానా తీసుకొని గత నెల 21నుంచి ఈనెల 20వరకు తరలించేందుకు అనుమతులు ఇచ్చారు.
చెల్లించాల్సిన జరిమానాలో ఐదు రెట్లు చెల్లించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా డబ్బులు కట్టించుకొని అనుమతులు ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వైపు కలెక్టర్ కొత్తగా మట్టి పాలసీని తీసుకురాగా, పాత విధానంలో మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటో అంతుచిక్కడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం 5గంటలలోగానే రవాణా చేయాలనే నిబంధనలు ఉన్నా పగలు రాత్రి తరలిపోతున్నా, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
మట్టి మాఫియా రోడ్లను ఛిద్రం చేస్తున్నది. అనుమతికి మించి ఓవర్‌లోడ్‌తో మట్టిని తరలిస్తుండడంతో గ్రామాల్లోని రోడ్లు, రోడ్యాంలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. రాఘవాపూర్ నుంచి మట్టి తరలిస్తుండడంతో గ్రామంలో మూడు నెలల క్రితం వేసిన రోడ్డు, రోడ్యాం దెబ్బతిన్నాయి. దీంతో ఇటీవల గ్రామ ప్రజలు, మాజీ సర్పంచ్ మట్టి తరలింపు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
గతేడాది వరకు పెద్దపల్లి డివిజన్లో మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వమని చెప్పిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ యేడాది డివిజన్లోని 14చెరువులను మట్టి తీతకు గుర్తించడం అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటి వరకు పెద్దపల్లి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 14 చెరువుల్లో 3 లక్షల 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయా చెరువుల్లో నీళ్లు తగ్గిన తర్వాత అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇందులో కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి నకల ఒర్రె ప్రాజెక్టులో 40 వేల క్యూబిక్ మీటర్లు, పందిళ్ల పెద్ద చెరువులో 20 వేల క్యూబిక్ మీటర్లు, పెగడపల్లి పెద్ద చెరువులో 60 వేల క్యూబిక్ మీటర్లు, మంగపేట నల్ల చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, ధర్మారం మండలం ధర్మారం సీతల చెరువులో 30 వేల క్యూబిక్ మీటర్లు, సర్సింగాపూర్ చిన్న చెరువులో 40 వేల క్యూబిక్ మీటర్లు, దొంగతుర్తి పెద్ద చెరువులో 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఉందని గుర్తించారు. అయితే ఇటుక బట్టీల యజమానుల పేరిట అనుమతులు పొందేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జిల్లాలో అక్రమంగా మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష కొత్తగా మట్టి పాలసీని తీసుకువచ్చారు. ఈ వేసవి నుంచే అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం మట్టి తరలింపునకు తహసీల్దార్లు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వే బిల్ కచ్చితంగా ఉండాలి. దీనిని తహసీల్దార్లే జారీ చేస్తారు. ఏ చెరువు నుంచి ఎకడికి మట్టిని తరలిస్తున్నారనే వివరాలు అందులో పేరొనాలి. ఒక స్థలం రాసి, మరో చోటికి తరలించకూడదు.
నీటి పారుదల, గనులు, భూగర్భ శాఖల అధికారులు సూచించిన మేరకు మాత్రమే మట్టిని తోడుకెళ్లాలి. సీనరేజ్ డబ్బులు మాత్రం గనులు, భూగర్భ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తరలించాలి. ఆ తర్వాత తరలించినా, పాలసీ నిబంధనలు అతిక్రమించినా చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీగా అమలయ్యేనా..? అన్న సందేహాలు తలెత్తతున్నాయి.