అబ్కారీ శాఖలో అక్రమాల లీలలు వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మద్యం విక్రయాలకు ప్రభుత్వం టార్గెట్లు పెడుతుండగా, ఇదే అదనుగా కొందరు అధికారులు రెచ్చిపోతూ తమకు కావాల్సిన రీతిలో వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, రెండేళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌లు జారీ ఇవ్వడానికి ఒక్కో దుకాణానికి రెండున్నర లక్షల చొప్పున ముడుపులు తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం కాగా, ఈ విషయంలో ఇటీవల ఎక్సైజ్‌శాఖలో ఓ వివాదం అయినట్టు తెలుస్తున్నది.
అవినీతి నిరోధకశాఖ ఆరా తీస్తున్న సమయంలో ఈ అంశం కూడా బయటకు వచ్చినట్టు ఓ అధికారి తెలుపడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎక్సైజ్‌శాఖకు చెందిన ఓ అధికారి ఏసీబీ చిక్కిన నేపథ్యంలో ఈ అవినీతి బాగోతం బయటపడుతున్నది. లైసెన్స్ జారీకి ముడుపుల వసూలు విషయంలో ఎస్ఐ పై స్థాయి అధికారులే ఈ దందాను పూర్తిచేసి, పై అధికారుల స్థాయిలోనే పంపకాలు చేసినట్టు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మద్యం దుకాణాలు, పర్మిట్‌రూంల నిర్వాహకుల నుంచి పెద్దఎత్తున ముడుపులు ముడుతుండడం వల్లే వారిని కంట్రోల్ చేయడానికి ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ సదరు అక్రమ దందాలకు అడ్డుపడాలని చూస్తే.. తమ అవినీతి బయట పడుతుందన్న ఆందోళన కూడా కొంత మంది అధికారుల్లో ఉందన్న చర్చ శాఖలోనే జరుగుతున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మద్యం దుకాణాలకు గతేడాది టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు 290 దుకాణాలకుగాను వందలాది మంది పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో దుకాణం దక్కించుకున్న తర్వాత సదరు యజమానులకు అబ్కారీ శాఖాధికారులు లైసెన్స్ ఉచితంగా జారీ చేయాలి. నిబంధనల ప్రకారం చూస్తే.. దుకాణం దక్కించుకున్న వ్యాపారికి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అంటే రెండేళ్ల కాలానికి లైసెన్స్‌లను ఇవ్వాలి. అయితే ఇక్కడే కొంత మంది ఎక్సైజ్ అధికారులు మామూళ్లకు తెరలేపారు.
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మద్యం క్రయవిక్రయాలు, వాటి ద్వారా దుకాణందారులకు వచ్చే ఆదాయం వంటి లెక్కలు వేసి, అందుకు అనుగుణంగా సదరు దుకాణందారుల నుంచి ఆమ్యామ్యాలు వసూలు చేయాలని నిర్ణయించి, ఆ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే రెండేళ్లకు కలిపి ఒక్కో మద్యం దుకాణందారుడి నుంచి రెండున్నర లక్షల రుపాయలు వసూలు చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలా డబ్బులు ఇచ్చిన వారికే ముందుగా లైసెన్స్‌లు జారీచేయడంతో మిగిలిన వారు సైతం గత్యంతరం లేక అదే తోవలో వెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో ఎస్ఐ స్థాయి పై అధికారులే ఈ డబ్బులను వసూలుచేసి పై స్థాయిలో పంపకాలు చేసినట్టు సమాచారం. అయితే కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైనట్టు తెలుస్తున్నది.
ప్రశ్నించిన జగిత్యాల దుకాణందారులు
ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో దాదాపు 94, పెద్దపల్లిలో 77, సిరిసిల్లలో 48, జగిత్యాల జిల్లాలో 71 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటికి ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని లంచాల డిమాండ్‌ను తెరపైకి తెచ్చి, గుట్టుచప్పుడు కాకుండా వసూళ్ల ప్రక్రియ పూర్తి చేసినట్టు సమాచారం. డబ్బులు ముట్టిన తర్వాతే లైసెన్స్‌లు జారీ అయినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఈ విషయంలో కొంతమంది దుకాణందారులు అధికారులను ప్రశ్నించినట్టు చర్చ జరుగుతున్నది. రెండేళ్లకు కలిపి ముందస్తుగానే ఒక్కో దుకాణం నుంచి రెండున్నర లక్షల చొప్పున డబ్బులు వసూలు చేస్తే.. ఎస్ఐ స్థాయి పై అధికారులు బదిలీ జరిగి వారి స్థానంలో కొత్త వాళ్లు వస్తే తమ పరిస్థితి ఏంటని కొంత మంది ప్రశ్నించినట్టు సమాచారం.
ఇప్పుడు ఇచ్చి, మళ్లీ కొత్తగా వచ్చే అధికారులకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో జగిత్యాల జిల్లాలోని పలువురు మద్యం దుకాణందారులు గట్టిగా వాదించినట్టు సమాచారం. దీంతో జగిత్యాల జిల్లాలోని వ్యాపారులు మాత్రమే ఏడాది మామూలు అంటే.. దుకాణానికి రూ లక్షా ఇరవై ఐదు వేలు ఇచ్చినట్టు ప్రస్తుతం మద్యం దుకాణం నిర్వాహకుల్లోనే చర్చ నడుస్తున్నది. కానీ, మిగిలిన కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మాత్రం రెండేళ్ల ముడుపులను ముక్కు పిండి వసూలు చేశారన్న ప్రచారం కూడా ప్రస్తుతం ఆ శాఖలో బాగా జరుగుతున్నది. నిజానికి ఈ ముడుపుల వ్యవహారంపై ఏసీబీ కూడా ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై లోతుగా విచారణ జరిపితే.. ఆయా ప్రాంతాల్లో నిన్నామొన్నటివరకు పనిచేసిన క్షేత్ర స్థాయి సిబ్బందే అన్నీ వివరాలు చెబుతారన్న టాక్ ఇప్పుడు నడుస్తున్నది.
కదులుతున్న డొంక..
ఎక్సైజ్ శాఖలో తీగలాగితే ముడుపుల డొంకంతా కదులుతున్నది. ఈ నేపథ్యంలోనే ‘నమస్తే తెలంగాణ’కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 7న ‘మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ?’.. 11న ‘అధికారుల అండ.. ఆగని పర్మిట్‌రూంల దందా’.. 12న ‘క్యాష్ బుక్కుల్లో లంచాల లెక్కలు’ శీర్షికల పేరిట వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతంతోపాటు పర్మిట్ రూంల పేరిట సాగుతున్న దందాలు, అధికారుల అండదండలు, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నతీరు వంటి అంశాలను ఎండగట్టిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలోనే అబ్కారీ అధికారుల ముడుపుల బాగోతంపై ఏసీబీ కూడా ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఓ అధికారి పట్టుబడగా.. అక్కడ కూపీలాగితే మొత్తం వ్యవహారం బయటకు వస్తున్నది. లైసెన్స్ జారీ కోసం దుకాణందారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అలాగే పర్మిట్ రూంల నుంచి నెలానెలా ఆమ్యామ్యాలు తీసుకుంటున్న నేపథ్యంలో సదరు నిర్వాహకులకు అధికారులంటే పూర్తిగా అలుసుగా మారిందనే చర్చ నడుస్తున్నది. అందులో భాగంగానే నిబంధనలకు తూట్లు పొడుస్తూ వందల చదరపు అడుగుల్లో పర్మిట్ రూంలు నడుపుతున్నా.. అధికారులు మౌనం వహిస్తున్నరన్నా విమర్శలు వస్తున్నాయి.