Lakshmi Nagar roads | కోల్ సిటీ, జూలై 27: గోదావరిఖని లక్ష్మీనగర్ కు వస్తున్నారా..? జర పైలం.. అదుపు తప్పి జారి పడితే తప్పదు ప్రాణపాయం.. రెండు రోజుల వర్షానికి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. మొత్తం బురదమయంగా మారింది. వాహన చోదకులే కాదు… కాలి నడకన వచ్చేవారు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రధాన వ్యాపార కేంద్రం కావడం, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్న ప్రాంతం కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రెండు రోజుల ముసురు వానకు ఓల్డ్ అశోక్ ఏరియా రోడ్లు గుంతలుగా నాట్లు వేసేందుకు అనువుగా మారాయి. దీనితో పలువురు పట్టు జారి ప్రమాదాలకు గురవుతున్నాడు. నగర నడిబొడ్డు రోడ్ల దుస్థితి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.. ఆటోలు, కార్లు తప్పితే ద్విచక్ర వాహన దారులు, బాటసారులు అటు వైపుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
చాలా మంది అదుపు తప్పి కింద పడి. గాయాల పాలవుతున్నారు. రోడ్ల దుస్థితి మూలంగా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.