Koppula Eswar | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 25: రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు తారా స్థాయికి చేరుకున్నాయని, ప్రజల పక్షాన నిలబడి పోరాడి, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తల పైనే దాడిచేసి, వారిపైనే పోలీసులతో కేసులు నమోదు చేయిస్తూ అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య ఆరోపించారు. రామగుండం సీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంటే ముఖ్యం గా రామగుండం కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల్ , గోదావరిఖని, పెద్దపల్లి, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఈ పరిస్థితి దారుణం గా ఉందన్నారు. మంచిర్యాలలో ఇటీవల అక్కడి ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు ఓ గ్యాంగ్ ను ప్రోత్సహిస్తూ గంజాయి బ్యాచ్ లతో దాడులు చేస్తున్నారని తాజాగా బీఆర్ ఎస్ నాయకులు దగ్గుల మధు పై దాడులు చేసి తల పగుల కొట్టి అతడిపైనే మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. అదే విధం గా మంచిర్యాల కు చెందిన గడప రాకేష్, కందుల ప్రశాంత్ ల పై గత వినాయక చవితి సందర్భంగా దాడులు చేసి వారి పైనే అక్రమ కేసులు బనాయించారన్నారు. అదేవిధంగా అక్కడి ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు నేతృత్వం లో ఏజెంట్ లు దాడులు చేస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్నారు.
దళితులని చూడకుండా సాయి కేసులు నమోదు చేశారని ఆరోపించారు. గతం లో 10 ఏండ్లు అధికారం లో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షనాయకుల పై దాడులు చేయలేదని, పైగా ఫ్రెండ్లీ పోలీస్ లతో ప్రజలకు దగ్గరయ్యామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు, సోషల్ మీడియా వారియర్ ల పైన కాంగ్రెస్ ఎంఎల్ఏలు, మంత్రుల ప్రోద్బలంతో దాడులు చేస్తే ఊరుకోబోమని, ఎన్ని కేసులైనా భరిస్తామని, దాడుల పై సమగ్ర విచారణ జరుపాలని సీపీ కి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు మెతుకు దేవరాజు, అచ్చే వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, పాలడుగుల కనకయ్య, కిరణ్ జీ తదితరులు ఉన్నారు.
పోలీస్ ల అత్యుత్సాహం..
ఓ వైపు పోలీస్ ల అరాచకాల పై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదుకు వస్తే అక్కడ ఓ ఏసీపీ స్థాయి అధికారి మీడియా పై అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి, మాజీ ఎంఎల్ఏ లు ఫిర్యాదుకు రాగా మీడియా కు సమాచారం ఇచ్చారు. కాగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న ఓ ఏసీపీ స్థాయి అధికారి మీడియా ను బయటకు పంపించాలని కింది స్థాయి సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మీడియా సిబ్బంది వాదనకు దిగడంతో ఆయన వెనుదిరిగారు. మీడియా సిబ్బంది ఆందోళనకు సిద్ధం కాగా పోలీసులు సముదాయించారు.