చిగురుమామిడి, మార్చి 7: చిగురుమామిడి మండలంలో వరసగా హైనా దాడులతో దూడలు మృతి చెందుతున్నాయి. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో జీల మల్లేష్ యాదవ్ అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఆవుతోపాటు రెండు దూడలను గురువారం సాయంత్రం కట్టివేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున భావి వద్దకు వెళ్లగా ఆవుతో పాటు ఒకటే దూడ కనిపించింది. మరో సంవత్సరం వయసున్న దూడ మొక్కజొన్న చేనులో మేతమేస్తుందనుకొని తన పనుల్లో నిమగ్నమయ్యారు.
ఎంతకీ దూడ ఆవు వద్దకు రాకపోవడంతో అనుమానం వచ్చి, చుట్టూ పరిసర ప్రాంతాలతో పాటు మొక్కజొన్న చెనులో పరిశీలించగా దూడ మృతి చెంది కనిపించింది. దూడ కాళ్లు, తల బాగం తప్ప మిగతా అంతా పూర్తిగా మాంసాన్ని హైనా తినేసినట్లు బాధిత రైతు మల్లేష్ తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. ఇటీవల వరుసగా దూడలపై హైనా దాడి జరుగుతున్నప్పటికీ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పశువులు మృతి చెందుతున్నాయని ఎస్ఎఫ్ ఓ శేఖర్ అన్నారు. పశువులను ఉంచే ప్రదేశంలో చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని, లేదా పశువులకోసం ప్రత్యేకంగా పాకను ఏర్పాటు చేసుకొని అందులో పశువులను కట్టివేయాలని ఎస్ఎఫ్ఓ శేఖర్ రైతులను కోరారు.