హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 13 : సిర్సపల్లి శివారులో డంప్‌యార్డ్ ఏర్పాటును ఎట్టి పరిస్థితిల్లో అంగీకరించబోమని, అఖిల పక్షంతో భారీ ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. డంప్‌యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష సోమవారం 22వ రోజుకు చేరగా, దీక్షలో హుజూరాబాద్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మద్దతు ప్రకటించి మాట్లాడారు. డంప్‌యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు 22 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డంప్‌యార్డ్ కోసం సుమారు 500 ఎకరాల భూమి సేకరించినట్లు సమాచారం ఉందని, వెంటనే ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంప్‌యార్డ్ వల్ల తొమ్మిది మండలాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మండలాల ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అఖిలపక్షం ఏర్పాటు తర్వాత లక్ష మందితో భారీ ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 19న డంప్‌యార్డ్ ప్రాంతంలో నిర్వహించనున్న మల్లన్న పట్నాలకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్‌బాబు రావాలని, లేకుంటే వారి అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా తమ పాలకవర్గం ఉన్నప్పుడు ఈ ప్రతిపాదనకు అంగీకరించి సంతకం చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేనిపక్షంలో వారు తమ పదవులకు రాజీనామా చేసి హుజూరాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షలో క్లబ్ సభ్యులు మోహన్‌రావు, నారాయణరెడ్డి, ప్రభాకర్‌రావు, ముక్కెర రాజు, భాస్కర్‌రెడ్డి, కొండ గణేశ్, జేఏసీ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, రత్నం, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, లావణ్య, రవీందర్రావు, బీఅర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, శంతన్‌రెడ్డి పాల్గొన్నారు.