Husnabad | తిమ్మాపూర్, సెప్టెంబర్ 27: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి రద్దీ పెరుగుతున్నది. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగుకు తాకిడి ఎక్కువ ఉంటున్నది. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంతో వచ్చే బస్సులపై ఓవర్ లోడ్ పడుతున్నది. ఈ కారణంగానే హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు టైర్ పేలినట్టు తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు దాదాపు వంద మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్నట్టు తెలుస్తుండగా, నుస్తులాపూర్ దాటిన తర్వాత రాజీవ్హ్రదారిపై భారీ శబ్ధంతో వెనుక టైరు పేలింది.
దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత టైరు పేలిందని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం సమయంలో సంఖ్యకు సరిపడా బస్సులు లేకపోవడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రద్దీ సమయాల్లోనైనా బస్సులను ఎక్కువగా తిప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.