తెలంగాణ చౌక్, ఆగస్టు 28: నాటు తుపాకుల తయారీదారుతోపాటు వాటితో అటవీజంతువులను వేటాడే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గంభీరావుపేట మండలం గజసింగవరానికి చెందిన రాయలింగు శంకర్ కొన్నిరోజులుగా నాటు తుపాకులు తయారు చేస్తూ, వేటగాళ్లకు విక్రయిస్తున్నాడు.
ఈ క్రమంలో పక్కా సమాచారం మేరకు బుధవారం రాయలింగు శంకర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. నాటు తుపాకుల తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్న రాయలింగు చంద్రమళి, శాతవేణి హరీశ్, గంగయ్యలను అదుపులోకి తీసుకోని వారి వద్ద రెండు తుపాకులు, నాలుగు ట్రిగర్ భాగాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిందితులను చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసిన ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామ్మోహన్, రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.