మల్యాల, జనవరి 23: కొండగట్టు అంజన్న క్షేత్రం కిక్కిరిసింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో దొంగల మర్రి నుంచి కొండగట్టు ఆలయం దాకా మూడు కిలోమీటర్ల మే ట్రాఫిక్ జాం కాగా, పోలీసులు క్రమబద్ధీకరించారు. రద్దీ దృష్ట్యా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఈవో టంకశాల వెంకటేశం, పాలక మండలి చైర్మన్ తిరుక్కోవళూర్ మారుతీస్వామి పర్యవేక్షించారు. కాగా, స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నారని, వివిధ సేవల రూపంలో ఆలయానికి 12 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కాగా, అంజన్న సన్నిధిలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు తీర్థప్రసాదాలు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు.