తిమ్మాపూర్, ఆగస్టు 14: హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా..? అంటూ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిభాఫూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను కలెక్టర్ పమేలా సత్పతి ఆరా తీశారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆమె గురుకులాన్ని సందర్శించారు. పాఠశాల ఆవరణ అంతా కలియదిరిగారు. వంటలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్, ఆగస్టు 14: మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. గ్రామాల నుంచి పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యసిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు వండుతున్న భోజనాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, మండల ప్రత్యేకాధికారి శ్రీధర్, తహసీల్దార్ రాజేశ్వరి, వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, సీహెచ్‌వో రాజూనాయక్, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర వేడుకలకు కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. బుధవారం రాత్రి కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.02 గంటలకు జెండా ఆవిష్కరణ, 9.10 గంటలకు వందన స్వీకారం, 9.25 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు సందేశం, 9.30 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, 10.45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.45 గంటలకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు, మెమోంటోల ప్రదానం, 11.30 వరకు వివిధ శాఖల స్టాల్స్ పరిశీలన కార్యక్రమాలు ఉంటాయి.