Rain | వీణవంక, సెప్టెంబర్ 12: గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీ-శంకరయ్య దంపతులు తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా నానాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి పై కప్పుతో పాటు సగానికి పైగా ఇల్లు కూలిపోయింది.
ఆ సమయంలో వృద్ధ దంపతులు లక్ష్మీ-శంకరయ్య ఇంట్లోనే ఉండగా రాత్రి 10 గంటల సమయంలో ఇంటి పైభాగం కూలుతున్నట్లు శబ్ధం వినిపించింది. దీంతో వారు వెంటనే బయటకు పరుగులు తీశారు. బయటకు వెళ్లగానే ఇల్లు కూలిపోయిందని కొంచమైతే ప్రాణాలు పోయేవని, తమకు ఇల్లు కట్టుకునే స్థోమత లేకనే పాత ఇంట్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగినట్లు వాపోయారు. ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు చింతల లక్ష్మీ-శంకరయ్య కోరుతున్నారు.