Lones | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 14: అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మాత్తుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన అనంతరమే ఈపథకం అమలు తేదీ ప్రకటించనున్నట్లు తెలుస్తుండగా, దరఖాస్తుదారుల యూనిట్లు కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వారం, పదిరోజుల్లోనైనా చెక్కులు పంపిణీ చేస్తారనే ఆశతో ఇన్ని రోజులుగా వేచిచూస్తున్న లబ్ధిదారులు, తాజా పరిణామాలతో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
అదిగో వచ్చే ఇదిగో తీసుకోండి అంటూ ఊరించిన ప్రభుత్వం ఒక్కసారిగా ఉసూరుమనిపించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు.. మరెన్నో ఇక్కట్ల మద్య తాము లబ్దిదారులుగా ఎంపిక కాగా, తమకొచ్చే రుణం ద్వారానైనా జీవితంలో స్థిరపడుదామనుకుంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనే ఆవేదన లబ్దిదారుల నుంచి వ్యక్తమవుతోంది. బిసి, ఎస్సీ, ఎస్సీ,మైనారిటీ, ఓబీసీ నిరుద్యోగులు వారికి ఇష్టమైన వృత్తుల ద్వారా స్వయం ఉపాది పొందేందుకు సరికొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నామంటూ ప్రభుత్వం జనవరిలో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించింది. నాలుగు కేటగిరీల్లో రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు, రూ. 4లక్షలు బ్యాంకర్లతో మాట్లాడి సబ్సీడీతో కూడిన రుణాలను అందిస్తామంటూ, యువత ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీంతో జిల్లాలో 51,549 మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు.
మొదటి కేటగిరీలో రూ.50వేల రుణం కోసం 1,323 మంది, రెండో కేటగిరీలో రూ. లక్ష రుణానికి 1,617 మంది, మూడో కేటగిరీ కింద రూ. 2లక్షల రుణానికి 7,598 మంది, నాలుగో కేటగిరీ కింద మంజూరయ్యే రూ. 4లక్షల రుణానికి 41,011 ధరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కేటగిరీల వారిగా అర్హులైన వారి జాబితాలను కూడా సిద్ధం చేశారు. అయితే, ముందుగా మొదటి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మాత్రమే ఈ నెల 2న అందజేసేందుకు నిర్ణయించారు. ఈమేరకు లబ్ధిదారులకు సమాచారం కూడా అందించారు. దీంతో, ఇహ తాము ఒక పనివారమవుతామనే సంతోషంలో మునిగిపోయారు. ఇంతలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకుని, ఆర్వైవి లబ్ధిదారుల చెక్కుల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు జూన్ 1న ప్రకటించగా, లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
నేడో, రేపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉండగా, ఇక ఇప్పట్లో ఆర్వివై పథకం ప్రారంభమయ్యే అవకాశాలుండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. యూనిట్ల మంజూరీలో కూడా మొదటి రెండు కేటగిరీలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మంజూరీ యూనిట్ల కన్నా తక్కువ దరఖాస్తులు రాగా, మూడు, నాలుగు కేటగిరీలకు దరఖాస్తులు చేసుకున్న వారిలో కొంతమంది మొదటి రెండు యూనిట్ల దరఖాస్తులు మార్చుకుంటున్నారు. వీరి సంఖ్య కూడారోజుకు పెరుగుతుండగా, మార్చుకుంటున్న దరఖాస్తులు మంజూరీ యూనిట్లకన్నా అధికమైతే ఇప్పటికే చెక్కులు రాసిన మా పరిస్థితి ఏంటనే ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నది. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే చెక్కులు పంపిణీ చేయాలనే డిమాండ్ వారి నుంచి వెలువడుతోంది.