SP Ashok Kumar | జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 06 : శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివని, పోలీసు సిబ్బందితో దీటుగా హోంగార్డ్స్ విధులు నిర్వర్తిస్తున్నారాణి ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి హోంగార్డ్ ఆఫీసర్స్ నిర్వహించిన పరేడ్‌ను తిలకించి, హోంగార్డు ఆఫీసర్స్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ హోం గార్డ్స్ వ్యవస్థ నేడు దేశవ్యాప్తంగా పోలీసు విభాగానికి బలమైన సహాయక శక్తిగా ఎదిగి, నిస్వార్థ సేవ అనే నినాదంతో ప్రజాసేవలో ముందుండి పనిచేస్తోందన్నారు. ట్రాఫిక్ నిర్వహణ, ఉత్సవాలు, ఎన్నికల బందోబస్తు, నైట్ పెట్రోలింగ్, నేరాల నిరోధం వంటి ఏ పనిలోనైనా హోం గార్డ్స్ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల భద్రత కోసం తమ సేవలను అందిస్తున్నారన్నారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లోనూ విధుల్లో నిజాయితీగా పనిచేస్తున్నారని ప్రసంశించారు.
జగిత్యాల జిల్లా హోం గార్డ్స్ లా అండ్ ఆర్డర్, వీఐపీ డ్యూటీలు, విపత్తు నిర్వహణ, కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లలో విశేష పాత్ర పోషిస్తున్నారన్నారు. హోం గార్డుల సంక్షేమం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం కొనసాగిస్తూ, మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కళాబృందం లో హోం గార్డ్స్ సేవలు ప్రత్యేకం
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మూడ నమ్మకాలు వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో కళాబృందం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని చెప్పారు. అంతేకాకుండా, షీ టీమ్స్‌తో కలిసి పాఠశాలలు, కళాశాలల్లో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.
హోం గార్డుల సంక్షేమం
హోం గార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం డ్యూటీ అలవెన్స్ రూ.921 నుండి రూ.1,000కు పెంచిందని, ట్రాఫిక్ డ్యూటీలకు 30శాతం ప్యాల్యూషన్ హజార్డ్ అలవెన్స్ , పరేడ్ అలవెన్స్ రూ.100 నుండి రూ.200కు పెంపుచేయడం తో పాటు సహజ, ప్రమాద మరణాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జిల్లాలోని అన్ని హోం గార్డులకు వూలెన్ జాకెట్లు, రెయిన్కోట్లు పంపిణీ చేశమన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ సదుపాయం విస్తరణ, తాత్కాలిక వైద్య సదుపాయాలు-బ్యాంకుల సహకారం హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల సహకారంతో హోం గార్డుల కోసం ప్రత్యేక వైద్య బీమా పథకం అమల్లోకి వచ్చిందన్నారు.
హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన హోంగార్డ్స్ కు బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం కళాబృందం ద్వారా ప్రజల్లో చైతన్యం కనుబరుస్తున్న కళాబృందం సభ్యులను ఘనంగా సన్మానించి బహుమతులు ప్రధాన చేశారు, అదేవిధంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్ఐలు, హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.