VHP | జగిత్యాల, ఆగస్టు 20 : హిందూ సమాజంలోని అనైక్యతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న విదేశీ శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ అఖిలభారత గో సేవ సహ ప్రముఖ్ ఆకారపు కేశవ్ జీ అన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జగిత్యాల గీత గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశవ్ జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన మన దేశాన్ని వందల సంవత్సరాల పాటు విదేశీయులు పరిపాలించి హిందూ ధర్మాన్ని నిర్మూలించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత విదేశీయులు మతమార్పిడులకు పాల్పడి మన దేశ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ రెండో సర్ సంఘ్ చాలక్ గురూజీ గోల్వాల్కర్ సూచనతో విశ్వహిందూ పరిషత్ ని స్థాపించినట్లు తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, మతం మార్పులను నిరోధించడం కోసం, హిందూ వాన బిందువులైన దేవాలయాలు గోగుల సంరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ఎన్నో ఉద్యమాలను చేపట్టిందన్నారు. చారిత్రాత్మకమైన రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేసి అయోధ్య రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అంట రాని తనాన్ని రూపుమాపి హిందూ సమాజాన్ని బలోపేతం చేయడం కోసం దేశవ్యాప్తంగా గిరిజన తండాలు, దళిత బస్తీలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు, భజన మండలిలు నిర్వహిస్తుందన్నారు.
ప్రస్తుతం దేశంలో హిందూ ధర్మాన్ని నిర్మూలించడం కోసం ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయని వారి కుట్రలను హిందూ సమాజం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ బాలికలను లవ్ జిహాద్ పేరుతో మోసం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పద్మాకర్, పట్టణ అధ్యక్షులు అరుణ్, తుకారాం, సంతోష్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.