శంకరపట్నం, జనవరి 28 : ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు చేసి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు. ఈ పంట సాగుతో 4-30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చన్నారు. చీడపీడల బెడద ఉండదన్నారు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, తదితర అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. రూ.20కి మొక్క లభిస్తుందని, ఎకరానికి సమాంతర, త్రిభుజాకార పద్ధతిలో నాటితో 57 మొక్కలు సరిపోతాయని చెప్పారు. ఎకరానికి రూ.1,25,000 వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ వీరస్వామి, పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, రాజాపూర్ సర్పంచ్ వసంత, హార్టికల్చర్ అధికారి మంజూవాణి, ఏఈవోలు రాజ్‌కుమార్, శ్రావణి పాల్గొన్నారు.
పచ్చునూర్లో శనివారం లోహియా కంపెనీ క్షేత్ర అధికారి రాజ్‌కుమార్, రైతులు గోపు శంకర్ రెడ్డి, కసిరెడ్డి సుధాకర్ రెడ్డి, నరహరి గణేశ్ రెడ్డి క్షేత్రంలో శనివారం అయిల్ పామ్ మొక్కల్ని నాటారు. దాదాపు 9.5 ఎకరాల్లో మొక్కల్ని నాటి వాటి దిగుబడి వివరాలను రైతులకు వివరించారు. ఒక్కసారి నాటి మొక్క 3 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని, 80-90 శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయ విస్తరణ, ఉద్యానవన అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.