సైదాపూర్, జనవరి 28: పెసర సాగుతో భూసారాన్ని పెంచుకోవచ్చని కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.మంజులత పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పెరపల్లిలో యాదాద్రి రకం పెసర పంపిణీ, వరి మాగాణుల్లో పెసర సాగు, పచ్చి రొట్ట ఎరువు వాడకం, నువ్వుల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వానకాలం వరికి ముందుగా పెసర సాగు చేసుకుని భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి పెసర రకం విత్తనోత్పత్తికి 15 మంది రైతులను ఎంపిక చేసి, ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో సాగు చేస్తున్న కుసుమ, మొకజొన్న, పల్లి, వరి పొలాలను సందర్శించి రైతుల అభిప్రాయాలను సేకరించారు. తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో డాక్టర్ రజినీకాంత్, డాక్టర్ ఉషారాణి. డాక్టర్ మదన్మోహన్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి టి. వంశీ, రైతులు పాల్గొన్నారు.
పంట వివరాల నమోదు
మల్యాల గ్రామంలో ఏఈవో సంపత్ రైతులు పండించిన పంటల వివరాలను నమోదు చేశారు. శుక్రవారం ఏఈవో రైతులు సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాసంగిలో రైతులు వరికి బదులు కంది, మక్క, పెసర, శనగ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు.
సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక లాభం
సేంద్రియ ఎరువుల వినియోగంతో ఖర్చు తగ్గి ఆధిక లాభం వస్తుందని ఏఈవో లక్ష్మణ్ పేర్కొన్నారు. మండలంలోని సైదాబాద్ లో శుక్రవారం ఏఈవో రైతులు సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకుని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు తప్పక భూసార పరీక్షలను చేసుకోవాలని, సేంద్రియ ఎరువుల వినియోగంతో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. యాసంగిలో వరికి బదులు కంది, మక్క, పెసర, శనగ, పొద్దు తిరుగుడును సాగు చేసుకోవాలని సూచించారు.