Godavarikhani | కోల్ సిటీ, జూన్ 27: గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడ నుంచి పిల్లలు చదివే గాంధీ పార్క్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకున్నారు. తాము బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామనీ, ఆశ్రమ పిల్లలను స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పడంతో పాఠశాల అధ్యాపకులు, హెచ్ఎం ఆధారాలు చూపించాలని ప్రశ్నించారు. దీంతో కంగారు పడ్డ బాలల రక్షక్ అధికారులు ఓ తెల్ల కాగితంపైన రాసిచ్చారు.
కలెక్టర్ నుంచి గానీ, డీఈఓ నుంచి ఏమైనా నోటీసులు ఉంటే చూపిస్తేనే పిల్లలను అప్పగిస్తామని ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. దీంతో బాలల సంరక్షణ సంస్థ అధికారులు, ఉపాధ్యాయుల మధ్య రెండు గంటల పాటు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. పాఠశాల పని వేళలో వచ్చి విధులకు ఆటంకం కలిగించవద్దని చెప్పినా వినిపించుకోలేదు. ఈ సంఘటనతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత వాతావరణంకు దారితీసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతా గుమిగూడటంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం ఐడెంటి కార్డులు చూపించమని అడిగినా చూపించలేదు. ఆశ్రమానికి అనుమతులు లేవని, పిల్లలను తాము స్వాధీనం చేసుకొని పెద్దపల్లి సంరక్షణ కేంద్రంకు తరలిస్తామని చెప్పగా, పాఠశాల సమయంలో తాము అప్పగించమని, ఏదైనా అధికారికంగా నోటీసు ఉంటె చూపించాలని హెచ్ఎం అభ్యంతరం తెలిపారు. దీంతో వచ్చిన వారు అక్కడే పాఠశాల ముగిసేవరకు వేచి ఉండి పిల్లలను వాహనంలో ఎక్కించుకొని చివరకు అనేక నాటకీయ పరిణామాల మధ్య వెంట తీసుకవెళ్లారు.
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు రాజయ్య మాట్లాడుతూ తమ ఆశ్రమానికి అన్ని అనుమతులు ఉన్నాయనీ, హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి ఉద్దేశ పూరితంగానే పిల్లలను తీసుకవెళ్లారనీ, తాను అందుబాటులో లేనిది చూసి ఆశ్రమంకు వచ్చి వార్డెన్ ను కూడా బలవంతంగా నెట్టివేశారని ఆరోపించారు. పాఠశాల ఉపాధ్యాయులను అడగగా, వచ్చిన వారు ఎవరో కూడా చెప్పడం లేదనీ, ఏలాంటి నోటీసులు కూడా చూపించలేదనీ, ఓ తెల్ల కాగితంపై వైల్డ్ వెల్ఫేర్ అని రాసిచ్చి బలవంతంగా తీసుకవెళ్లారని పేర్కొన్నారు. అప్పటికే తాము జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకవెళే, అధికారికమైన నోటీసులు చూపించి నిర్ధారించుకున్నాకే పిల్లలను అప్పగించాలని చెప్పారన్న విషయం కూడా వివరించిన అత్యుత్సాహం కనబరిచి ససె మీరా అంటూ పిల్లలను తీసుకువెళ్లారని వాపోయారు.