పత్తి రైతుపై మళ్లీ హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) విత్తన కత్తి వేలాడుతున్నది. గ్లెఫోసెట్ అనే గడ్డి మందును తట్టుకునే జన్యువుతో రూపొందించిన ఈ విత్తనాల ద్వారా కాలుష్యంతోపాటు నేల సారం దెబ్బతినే ప్రమాదముండగా.. గత కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కానీ, ప్రస్తుతం మళ్లీ ముప్పు కనిపిస్తున్నది. పూర్తి స్థాయి పర్యవేక్షణ లేక ఈ సీడ్ చాపకింద నీరులా పల్లెలకు చేరుతున్నది. కరీంనగర్ జిల్లాలో కొందరు బ్రోకర్లు గ్రామాల్లో తిరుగుతూ.. బోల్‌గార్డు (బీజీ)-3 విత్తనాల పేరిట రైతులకు అంటగడుతున్నట్టు తెలుస్తుండగా, అధికారుల తనిఖీల తీరు విస్తుగొలుపుతున్నది. దందా పల్లెల్లో జరుగుతుంటే.. పట్టణాల్లో నిఘా పెట్టి చేతులు దులుపుకొంటున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ైగ్లెఫోసెట్ అనే గడ్డి మందును తట్టుకునే జన్యువుతో రూపొందించిన హెచ్‌టీ పత్తి విత్తనాల ద్వారా కాలుష్యంతోపాటు నేల సారం దెబ్బతింటున్నదని గత ప్రభుత్వాలు నిషేధించాయి. హెచ్‌టీ పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే నేపథ్యంలో ైగ్లెఫోసెట్ తప్పని సరిగా వాడుతారని భావించాయి. ఈ మందును కేవలం తేయాకు తోటల్లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉన్నది. అయితే ఇప్పుడు పత్తి సాగులో కూడా వాడాలంటే కొన్ని కంపెనీలు ఈ గడ్డి మందును తట్టుకునే జన్యువుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను రూపొందించారు. గతంలో కొందరు లైసెన్స్డ్ డీలర్లు కూడా వీటిని విక్రయించినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు.
ఇప్పుడు కొందరు బ్రోకర్లు గ్రామాల్లో పర్యటిస్తూ బోల్‌గార్డు (బీజీ)-3 విత్తనాల పేరిట రైతులను బురిడీ కొట్టించి హెచ్‌టీ విత్తనాలను అంటగడుతున్నట్లు తెలుస్తున్నది. గడ్డి మందును తట్టుకునే సామర్థ్యం ఉందని ప్రచారం చేయడంతో రైతులు ఎక్కువ ధర అయినా సరే చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్, హుజూరాబాద్ తదితర చోట్ల గతంలో పెద్ద మొత్తంలో ఈ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. బట్ట సంచుల్లో తెచ్చి ఆయా గ్రామాల్లో కొందరు రైతుల ద్వారానే తోటి రైతులకు దళారులు విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే హెచ్‌టీ విత్తనాలతోపాటు ైగ్లెఫోసెట్ను కూడా రహస్యంగా రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వీటికి తోడు అన్ట్రీటెడ్ పత్తి విత్తనాలు కూడా దళారుల ద్వారా గ్రామాలకు చేరుతున్నట్టు తెలుస్తున్నది.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు వ్యవసాయ, పోలీస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మండల, వ్యవసాయ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆయా విత్తన డీలర్ల దుకాణాల్లో తనిఖీలు చేశాయి. అంతే కాకుండా ట్రాన్స్‌ఫోర్ట్ సంస్థల ద్వారా ఇతర వస్తువుల పేరిట జిల్లాకు చేరే ముప్పు ఉందని భావించి, సదరు సంస్థలపైనా నిఘా పెట్టారు. తమ పరిధిలోని విత్తనాల దుకాణాల్లో గత నెలలో విస్తృతంగా తనిఖీలు చేశాయి. నకిలీ విత్తనాలను ఏ విధంగా అరికట్టాలనే విషయమై, పత్తి విత్తనాల సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు.
మొక్కుబడిగా సాగిన ఈ సదస్సుల వల్ల రైతుల్లో పెద్దగా అవగాహన కలిగింది లేదు. అయితే అధికారులు పట్టణాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మినహా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా నిఘా పెట్టింది లేదు. దీంతో ఒక రైతు నుంచి మరో రైతుకు ఈ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కరీంనగర్ రూరల్ మండలం, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్ తదితర మండలాల్లో రైతులు హెచ్‌టీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తున్నది. గతంలో రామడుగు మండలంలోని పలు గ్రామాలకు చెందిన కొందరు ఈ దందా విపరీతంగా చేశారు. ఇతర జిల్లాల్లోని టాస్క్‌ఫోర్స్ బృందాల తనిఖీల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందు లభిస్తుంటే ఇప్పటి వరకు జిల్లాలోని టాస్క్‌ఫోర్స్ మాత్రం ఒక్క చోట కూడా వీటిని పట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
హెచ్‌టీ పత్తి విత్తనాల సాగు అత్యంత ప్రమాదకరమైనది. ఈ తరహా విత్తనాలు సాగు చేస్తే గడ్డి నివారణ తప్పుతుందని సాగు వ్యయం తగ్గుతుందుని రైతులు భావిస్తుంటారు. ఈ విషయాన్నే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న దళారులు గ్రామాలకు నేరుగా వెళ్లి రైతులకు విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఈ విత్తనాలు తెస్తున్నట్టు తెలుస్తున్నది. హెచ్‌టీ పత్తి విత్తనాలు సా గు చేసి ైగ్లెఫోసెట్ను వాడినట్లయితే భూ సారం పూర్తిగా దెబ్బతిని కొన్నాళ్ల వరకు నేల పూర్తిగా గుల్లబారి పోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సారం పూర్తిగా దెబ్బతిని ఇసుక మాదిరిగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి కూడా ప్రమాదం ఉంటుందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్‌టీ పత్తి విత్తనాలను, ైగ్లెఫోసెట్ గడ్డి మందును నిషేధించామని చెబుతున్నారు. గత ప్రభుత్వం ఈ విత్తనాలపై ఉక్కుపాదం మోపింది. హెచ్‌టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు రైతులకు టెక్నికల్ కిట్స్ కూడా అందించింది. ఫలితంగా కొన్నాళ్లపాటు దళారులు తెలంగాణ వైపు తొంగి చూడలేదు. అయితే ఈ సీజన్లో మాత్రం విత్తనాలు విచ్చలవిడిగా రైతులకు అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు ఈ విత్తనాలను సాగు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.