Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 22 : వినియోగదారుల నుంచి మంచినీటి బిల్లులు, చెత్త సేకరణ ఛార్జీలను పెంచేందుకు రామగుండం నగర పాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. అందుకోసం ప్రతిపాదనలు తయారు చేసింది. రేపటి కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆమోదం తరువాయి వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 40,536 మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లకు ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఇందుకు గానూ గతం నుంచి ప్రతి నల్లా కనెక్షన్ కు నెలకు రూ.100 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నది. రోజుకు మించి రోజు స్థానంలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా జరిగింది. గోదావరిలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో కొద్ది రోజులుగా పూర్వ పద్ధతిలోనే రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేస్తున్నది.
విద్యుత్ ఛార్జీలు, ఇత్యాధి ఖర్చులు పెరిగి నీటి సరఫరా నిర్వహణ భారంగా మారిందనే నెపంతో నల్లా కనెక్షన్ నెలవారీ రుసుంను రూ.150 పెంచుతుంది. జనవరి నెల నుంచి అమలు చేయడానికి 25వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో పరిపాలన ఆమోదం కోసం ఎజెండా రూపొందించింది. అలాగే నివాస గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణకు గానూ వినియోగదారుల ఛార్జీలను వసూలు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. 300 చ.మీ వైశాల్యం కలిగిన గృహాలకు నెలకు రూ.50, ఆపై గృహాలకు రూ.100, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కర్రీ పాయింట్లు, స్వీట్ హౌజ్‌లు, చాయ్ హోటళ్ల నుంచి రూ.250, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రూ.1500, రెస్టారెంట్లకు రూ.2 వేలు, మాంసం వ్యాపారులకు రూ.వెయ్యి, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, బీమా కార్యాలయాల నుంచి రూ.వెయ్యి, ప్రైవేటు క్లినిక్‌లు, ల్యాబ్‌ల నుంచి రూ.3వేల నుంచి రూ.5వేలు, గోదాములు, కుటీర పరిశ్రమలకు రూ.1500, వివాహ మందిరాలు, వైన్ షాపులకు రూ.3వేల నుంచి రూ.5వేలు, బార్ అండ్ రెస్టారెంట్లకు రూ.5వేలు ఛార్జీలు వసూలు చేయనుంది. ప్రతి ఏటా ఈ ఛార్జీలను 5 శాతం పెంచడానికి నిర్ణయించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, ఉమ్మినా, రోడ్లపైకి పశువులు వదిలినా రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు జరిమానాలు విధించనున్నారు.