Ramagundam | కోల్ సిటీ, ఫిబ్రవరి 17: రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. నగర పాలక సంస్థ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పలు సంఘాల బాధ్యులు, మాజీ కార్పొరేటర్లు, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు తమ సమస్యలను విన్నవించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, రామగుండం నగర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని భరోసా కల్పించారు. ప్రధానంగా రామగుండంలో స్థానిక ఎమ్మెల్యే దిశా నిర్దేశంలో వ్యాపార రంగ అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలపై దృష్టి సారించి త్వరలోనే పరిష్కారంకు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, పలు కుల సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.