Government hospital | సిరిసిల్ల టౌన్, జూలై 2: గత ప్రభుత్వ హయాంలో 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పార్థీవ వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. జిల్లా కేంద్రంలోని శివనగర్ కు చెందిన వేముల రాజయ్య (78) అనే వ్యక్తి మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
రాజయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే గుండె పోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్య మృతదేహాన్ని వారి నివాసానికి తరలించేందుకు ఆసుపత్రిలో ఉండాల్సిన పార్థీవ వాహనం కోసం బాధిత కుటుంబ సభ్యులు సిబ్బందిని సంప్రదించారు. అక్కడే ఉన్న సంబంధిత ఫోన్ నంబర్లకు ఎన్ని సార్లు కాల్స్ చేసిన ఎవరూ స్పందించలేదు. ఆసుపత్రి సిబ్బంది సైతం వారి ఫోన్లో నుండి చేసిన పార్థీవ వాహనం సిబ్బంది స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఎంతసేపటికీ స్పందన రాకపోవడంతో చివరకు ఓ ప్రైవేటు అంబులెన్సులో సొంత ఖర్చులతో మృతదేహాన్ని తరలించినట్లు వాపోయారు. గతంలో మెరుగైన వైద్య సేవలతో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రి పాలకుల నిర్లక్ష్యంతో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు దృష్టి సారించి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.