జగిత్యాల, మే 31, (నమస్తే తెలంగాణ) : సాధారణ కాన్పులు పెంచాలని, సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అందుకు సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యాధికారులు, జిల్లా పాలనాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
‘మళ్లీ పెరిగిన కడుపు కోతలు’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచాలని స్పష్టం చేశారు. సాధారణ కాన్పులతో కలిగే ప్రయోజనాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాలపై దృష్టి సారించాలని, అనవసరంగా కడుపు కోతలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇటీవలి కాలంలో మళ్లీ కడుపు కోతలు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాల్లో అత్యధిక శాతం సిజేరియన్లే ఉంటున్నాయి. ఏడాది క్రితం వరకు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 65 శాతం, ప్రైవేట్లో 35 శాతం ప్రసవాలు నమోదు కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిస్థితి మారింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 48 శాతానికి, ప్రైవేట్లో 52 శాతం పెరిగాయి. అలాగే, గవర్నమెంట్ దవాఖానల్లో 60 శాతానికి పైగా ప్రసవాలు సిజేరియన్ల ద్వారా జరుగుతున్నట్టు లెక్కలు చెబుతుండగా, 40 శాతానికిలోపే సాధారణ కాన్పులు ఉంటున్నాయి.
ఇక ప్రైవేట్లో కేవలం 13 శాతమే సాధారణం కాగా, 87 శాతం సిజేరియన్లే నమోదవుతున్నాయి. ఇలా సమగ్ర వివరాలతో ‘మళ్లీ పెరిగిన కడుపు కోతలు’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. సిజేరియన్లతో మహిళలు అనారోగ్యం బారిన పడడమే కాదు పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతున్నదని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో రాష్ట్ర యంత్రాంగం కదిలింది.