మంథని, మే 15: విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరగా, కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నది. రోజుకు 50వేలకు పైగా ఖర్చవుతుండడంతో ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నది. వివరాల్లోకి వెళితే.. మంథని పట్టణం దొంతులవాడలోని రజక వీధికి చెందిన కొల్లూరి రాజేశ్వరీ-సమ్మయ్యకు కూతురు, కొడుకు సాయిమణితేజ ఉన్నారు. అయితే 15 రోజుల క్రితం ఓ పని నిమిత్తం బైక్‌పై లద్నాపూర్ వెళ్తుండగా మార్గం మధ్యలో వాహనం అదుపు తప్పి, సాయి మణితేజ తీవ్ర గాయాలపాలయ్యాడు.
తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. గంట వ్యవధిలోనే సమాచారం రావడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని, కరీంనగర్‌కు తీసుకెళ్లి ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. కొడుకును ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నదంతా ఖర్చు పెట్టి మరీ వైద్యం చేయిస్తున్నారు. రోజుకు 50వేలకుపైగా ఖర్చవుతున్నదని, తమ శక్తి సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, దాతలు ముందుకు వచ్చి సాయం చేసి మా కొడుకును కాపాడాలని రాజేశ్వరీ-సమ్మయ్య వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు 8885200731, 7207200731 నంబర్లకు ఫోన్ పే లేదా జీ పే చేయాలని కోరుతున్నారు.