ప్రభుత్వ పాఠశాలల ‘పాకి’ పనుల్లోనూ జగిత్యాల జిల్లా శాఖ అధికారులు పరేషాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో స్కూళ్ల పరిశుభ్రతే లక్ష్యంగా జూలైలో ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా ముందుకు సాగాల్సింది పోయి, దానిని పక్కకు పెట్టి సొంత రూల్ను అమలు చేస్తున్నారు. పిల్లల సంఖ్య ఆధారంగా స్కావెంజర్లను నియమించుకొని 3వేల నుంచి 20వేల వేతనం ఇవ్వాలని, అది కూడా ఆగస్టు నెల నుంచే పరిగణలోకి తీసుకోవాలని సర్కారు స్పష్టం చేయగా, ఆదేశాలను తుంగలో తొక్కేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా 3వేల శాలరీ మాత్రమే ఇవ్వాలని, అది కూడా నవంబర్ నుంచే అని చెప్పడంతో హెచ్ఎంలు హతాశులవుతున్నారు. సర్కారు ఆదేశాలు ఒకరీతిలో, పెద్ద సార్ల ఆదేశాలు మరోలా ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
జగిత్యాల, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘పాఠశాలల్లో పరిశుభ్రత అత్యంత ప్రధానమైన అంశం. మరుగుదొడ్లను శుభ్రం చేసే వారు లేక కంపు కొడుతున్నాయి. ఉపాధ్యాయులు, పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించుకునేందుకు ఆదేశాలు ఇస్తున్నాం. వీరికి ప్రభుత్వమే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వేతనాలు చెల్లిస్తుంది. తక్షణమే నియామకం చేపట్టండి’ రాష్ట్ర ముఖ్యమంత్రి గత జూలైలో చేసిన ప్రకటన ఇది. ఆయన ఆదేశాలతోనే స్కావెంజర్ల నియామకం కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అదే నెల 30న జీవో 21ను జారీ చేశారు.
జీవో 21 ఏం చెబుతోంది?
జీవో 21 ద్వారా స్కావెంజర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్ ఫెసిలిటి మెయింటనెన్స్ గ్రాంట్ ద్వారా స్కావెంజర్లకు వేతనాలు ఇస్తామని చెప్పింది. ప్ర భుత్వ యాజమాన్యంలోని పాఠశాలలతోపాటు స్థానిక సంస్థల ఆధీనంలోని పాఠశాలలు, మోడల్ స్కూల్స్లో స్కావెంజర్లను నియమించాలని సూచించింది. సమగ్ర శిక్ష పథకం ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డీఎంఎఫ్టీ) ద్వారా స్కావెంజర్ల వేతనాలను ప్రతి మూడు నెలలకోసారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగానే స్కావెంజర్లను నియమించాలని పేర్కొన్నది. పిల్లల నమోదు లేని పాఠశాలలకు స్కావెంజర్ల నియామకం అవసరం లేదని స్పష్టం చేసింది. 1నుంచి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలకు స్కావెంజర్ల వేతనం కోసం నెలకు 3వేలు చెల్లించాలని పేర్కొన్నారు. 31నుంచి 100లోపు ఉంటే పిల్లలున్న స్కూళ్లలో స్కావెంజర్ల కోసం నెలకు 6 వేలు, 101నుంచి 250మధ్య విద్యార్థుల సంఖ్య ఉంటే 8వే లు, 251 నుంచి 500 మధ్య ఉంటే 12వేలు, 501 నుంచి 750 మధ్య పిల్లలు ఉంటే ఆ పాఠశాలకు 15వేలు, 750పైన సంఖ్య ఉంటే ఆ పాఠశాలకు నెలకు 20వేల వేతనం ఇవ్వాలని నిర్ధారించారు.
జగిత్యాలలో నయా రూల్
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లకు సంబంధించిన వేతనాల కోసం నిబంధనలు ఒకటి చెబుతుండగా, జగిత్యాల జిల్లాలోని విద్యాశాఖ అధికారులు మాత్రం నయా నిబంధనలను జారీ చేశారు. డీఈవో పేరిట ఇటీవల జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు సెల్ఫోన్ ద్వారా మెసేజ్లు చేరాయి. ‘పదిహేను సంఖ్య కంటే అధికంగా ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్ నియామకం చేపట్టాలి. నెలకు 3వేల వేతనం ఉంటుంది. నవంబర్ నుంచి స్కావెంజర్కు జీతం ఇస్తారు. వేతనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ సమాచారాన్ని మండల విద్యాధికారి పరిధిలో ఉన్న ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు చేరవేయండి’ అని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు చూసిన మండల విద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో 820 పాఠశాలలు
జగిత్యాల జిల్లా విద్యాధికారి సెల్ఫోన్ మెసేజ్ల నేపథ్యంలో జిల్లాలోని చాలా మంది హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 820 పాఠశాలలు ఉండగా, దాదాపు 60వేల మంది అభ్యసిస్తున్నారు. సున్నా ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు 60 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకటి నుంచి 30లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు 263 ఉన్నాయి. 31 నుంచి 100లోపు సంఖ్య ఉన్న స్కూళ్లు 321 ఉండగా, 101 నుంచి 200 మధ్య సంఖ్య ఉన్న పాఠశాలలు 121 ఉన్నాయి. 201 నుంచి 300 మధ్య సంఖ్య ఉన్న పాఠశాలలు 37 ఉండగా, 301 కంటే అధిక సంఖ్య కలిగిన పాఠశాలలు 18 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. డీఈవో ఆదేశాల మేరకు 15 కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించుకోరాదు. ప్రభుత్వం 1 నుంచి 30 మధ్య ఎన్రోల్ మెంట్ అని చెబితే, జగిత్యాల విద్యాధికారి మాత్రం 15 సంఖ్యకు పైన ఉన్న పాఠశాలలకు మాత్రమే అని పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
ఇక విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 15 మంది కంటే ఎక్కువగా పిల్లలు ఉన్న స్కూళ్లలో స్కావెంజర్లను నియమించుకోవాలనడం సైతం ప్రధానోపాధ్యాయులకు అర్థం కావడం లేదు. 31 నుంచి 100 మధ్య సంఖ్య ఉన్న పాఠశాలలు జిల్లాలో 321 ఉన్నాయి. వీటికి నిబంధనల ప్రకారం నెలకు 6వేలు మంజూరు కావాలి. కానీ, జిల్లా విద్యాధికారి మాత్రం 3వేలు అని చెప్పడంతో హెచ్ఎంలు బిత్తరపోతున్నారు. 101 నుంచి 200 మధ్య పిల్లలు ఉన్న పాఠశాలలు 121 ఉండగా, ఒక్కో స్కూల్కు నెలకు 8వేలు ఇవ్వాల్సి ఉంది. ఇక 250 సంఖ్య పైన ఉన్న పాఠశాలలు 30 వరకు ఉన్నాయి. వీటికి నెలకు 12వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 700 సంఖ్యకు పైగా ఉన్న పాఠశాల సైతం కోరుట్లలో ఉంది. అయినా అన్నింటికీ నెలకు 3వేలు అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
తలలు పట్టుకుంటున్న హెచ్ఎంలు
జీవో ఎంఎస్ నంబర్ 21 ప్రకారం స్కావెంజర్లకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, జిల్లా విద్యాధికారి నుంచి వచ్చిన సెల్ఫోన్ ఆదేశాలతో హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. 50 మంది విద్యార్థుల కంటే అధికంగా సంఖ్య ఉన్న పాఠశాలల్లో కచ్చితంగా ఇద్ద రు స్కావెంజర్లను నియమించుకోవాల్సిన పరిస్థితి ఉండగా, ఒక్కరితోనే ఎలా పరిశుభ్రతను నిర్వహించాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్ల వేతనాలు అంటూ స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినా, ఇక్కడ ఇలాంటి నిబంధనలు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో జిల్లాలోని చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు స్కావెంజర్లను ఆగస్టు నుంచే నియామకం చేసుకున్నారు. వారందరికీ ఆగస్టు నుంచి వేతనం వస్తుందన్న భావనలో ఉన్నారు.
జీవో ఎం.ఎస్ 21లో సైతం పాఠశాలలకు పది నెలలకు సంబంధించి స్కావెంజర్లకు వేతనం ఇస్తామని స్పష్టంగా చెప్పారు. అయితే జగిత్యాల విద్యాధికారి మాత్రం ‘స్కావెంజర్ల నియామకం చేపట్టండి. నవంబర్ నుంచి వేతనం ఇస్తాం’ అని ఆదేశాల్లో పేర్కొనడంతో హతాశులవుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి స్కావెంజర్ల వేతనం ఎలా చెల్లించాలో తెలియడం లేదని వాపోతున్నారు. అయితే డీఈవోకు భయపడి, ఏ ఒక్క ప్రధానోపాధ్యాయుడు సెల్ఫోన్ ఆదేశాలపై మాట్లాడేందుకు ముందుకు రాలేకపోతున్నారు.
కాగా, ఈ విషయమై కలెక్టరేట్ అధికారులు మాట్లాడుతూ, పూర్తిస్థాయిలో విద్యార్థుల లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదించామని, మనకు ఉన్న పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య ప్రకారం నెల కు 46కోట్ల వరకు వ్యయమయ్యే అవకాశముందని అంచనాలు రూపొందించి నివేదించామంటున్నారు. ఏది ఏమైనా విద్యాధికారి ఆదేశాల నేపథ్యంలో హెచ్ఎంలు ఆందోళనకు గురవుతున్నారు. 30కి పైన విద్యార్థుల సంఖ్య ఉన్న చోట ఇద్దరు స్కావెంజర్లు, 100కు పైన సంఖ్య ఉంటే ముగ్గురు స్కావెంజర్లను నియమించుకోవాల్సి ఉంటుందని, ఒక్క స్కావెంజర్తోనే పాఠశాల పారిశుధ్యం సాధ్యం కాదని వాపోతున్నారు. అలాగే మూడు నెలలకు సంబంధించిన వేతనం ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని, మళ్లీ ఉపాధ్యాయులు కలిసి పోగుచేసుకోని ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కల్టెకర్ ఆదేశాల మేరకే : డీఈవో జగన్మోహన్రెడ్డి
15మంది విద్యార్థుల సంఖ్యకు మించిన పాఠశాల ల్లో మాత్రమే స్కావెంజర్లను నియమించుకోవాల ని, అలాగే ఒకే స్కావెంజర్ను ఏర్పాటు చేసుకోవాలని మండల విద్యాధికారులకు సెల్ఫోన్ మెసేజ్ ఇవ్వడంపై జిల్లావిద్యాధికారి జగన్మోహన్రెడ్డిని సం ప్రదించగా..కలెక్టర్ ఆదేశాల మేరకే 15సంఖ్య కం టే ఎక్కువ ఉన్న పాఠశాలలకు స్కావెంజర్లను నియమించుకోవాలని చెప్పామన్నారు. నిధులు తక్కువగా మంజూరయ్యాయని కలెక్టర్ చెప్పారని, ఆ నేపథ్యంలోనే మెసేజ్లు ఇచ్చామని వెల్లడించారు.