Vyalla Harish Reddy | కోల్ సిటీ, జూలై 16: సప్త సముద్రాలు దాటి.. అగ్ర రాజ్యంకు వెళ్లి ఉన్నతోద్యోగంలో స్థిరపడినా పుట్టిన గడ్డను మరువలేదు. ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని వీహెచ్ఆర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాడు. ఎన్నారైగా ప్రజాసేవకు శ్రీకారం చుట్టి వేలాది కుటుంబాలకు ఆర్థిక తోవ చూపించాడు. నియోజక వర్గంలో వలంటీర్లను నియమించి ఎంతోమందికి ఆపన్నహస్తం అందించాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే ఆర్థిక సాయం పంపించాడు. ఇంతకాలం తానెవరో కనిపించకపోయినా.. పది మందికి తన సాయం అందితే చాలనుకున్నాడు.
తద్వారా అనతి కాలంలోనే ఈ ప్రాంతానికి సుపరిచితుల్లో వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధినేత వ్యాల్ల హరీష్ రెడ్డి ఒకరయ్యారు. అంతేగాక అమెరికాలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వీరాభిమానిగా అక్కడ పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవడంతో కేటీఆర్కు సన్నిహితుడిగా మెదిలాడు. అలా ప్రజాసేవలో అలుపెరుగని ప్రయాణం చేస్తున్న హరీష్ రెడ్డి ఒక్కసారిగా ఇక్కడి ప్రజల్లో ప్రత్యక్షమయ్యాడు. అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఆయన మొదటిసారిగా గోదావరిఖనికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, వ్యాల హరీష్ రెడ్డికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, వీహెచ్ ఆర్ ఫౌండేషన్ వలంటీర్లు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో భారీ స్వాగత ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి పరిచయాలు లేకపోయినా ఆదరణను చూసి భావోద్వేగంకు లోనయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఇక పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. ముందుగా ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఎన్నారైగా ఆయన సేవలను గుర్తు చేసుకొని పలువురు అభినందనలతో ముంచెత్తారు. తాను రాజకీయాల్లోకి వచ్చినా ప్రజాసేవకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, వీహెచ్ఆర్ ఫౌండేషన్ సేవలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆ సంస్థ వలంటీర్లకు హరీష్ రెడ్డి నూతనోత్సాహం నింపారు.
ఇదిలా ఉండగా అమెరికాలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయాలంటే హరీష్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి ఆయన స్పందించి ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం పంపించేవాడు. ఆ సాయం బాధితులకు అందడానికి కొద్ది రోజుల సమయం పట్టేది. ఇప్పుడు తమ ఫౌండేషన్ అధినేత ఇక్కడికే పూర్తిగా రావడంతో వీహెచ్ఆర్ ఫౌండేషన్ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయంటూ రామగుండం టీం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. స్వాగతం పలికిన వారిలో నగర పాలక సంస్థ మాజీ కో ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, జాహెద్ పాషా, వీహెచ్ఆర్ ఇన్చార్జి సిగిరి రాము, మధుబాబుతోపాటు అధిక సంఖ్యలో వలంటీర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.