మల్యాల, ఏప్రిల్ 12: వేలాది మంది హనుమాన్ మాల దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ.., శ్రీ రామ జయ రామ, జయ జయ రామ.. అను రామ నామ సంకీర్తనలతో మార్మోగి పోయింది.
హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు సైతం ఉప్పెనలా తరలివచ్చిన వేలాది మంది దీక్షాపరులు మాల విరమణ చేసి, అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రామ నామ స్మరణలు, హన్మాన్ చాలీసాలు, అంజనేయ స్వామి దండకాలు, ఆటపాటలతో భక్తిపారవశ్యంలో మునిగితేలారు.