Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 28 : సీఎం కప్ రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హన్సిక రావు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విజేతగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభతో బంగారు పతకం సాధించింది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు గురి పెడితే విజయం తప్పదని నిరూపించింది. ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో హన్సిక రావు పెద్దపల్లి జిల్లా తరఫున పాల్గొని ప్రత్యర్థులను ఓడించి రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తి చాటింది.
కాగా హన్సిక రావు ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అటు చదువు, ఇటు క్రీడల్లో అసాధారణ ప్రతిభను చాటుతుంది. ఈ మేరకు హన్సికను శనివారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీ శోభారాణి, తల్లిదండ్రులు వనజ, వేణు తదితరులు పాల్గొని హన్సికను అభినందించారు.