కరీంనగర్ కార్పొరేషన్, మే 8 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ దాడి చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలే గానీ, ఇలా దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ గూండాల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, తాము విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గతంలో కరీంనగర్ సేఫ్‌సిటీగా దేశంలో 11వ స్థానం సాధించందని, కానీ, సంజయ్ కరీంనగర్లో గూండాగిరిని ప్రోత్సహిస్తున్నారని, రాజకీయాలను బ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయని విమర్శించారు. ‘మీ లాగే మేం దాడులు చేస్తే మీ కార్యకర్తలు మిగలరు?’ అని హెచ్చరించారు. దాడులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. దాడి వెనక కాంగ్రెస్ హస్తం ఉందని, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
సంజయ్‌కు ఎంతసేపూ బీఆర్ఎస్ను విమర్శించడానికే సరిపోతున్నదని, ఒక్క రోజైనా ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసిన సందర్భం ఉన్నదా..? అని నిలదీశారు. ఒక్కసారి కూడా రేవంత్‌రెడ్డిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజకీయం కోసమే బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటుందని దుయ్యబట్టారు. దాడికి నిరసనగా శనివారం నగర బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బంద్‌కు నగరంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్ యూసుఫ్, నాయకులు చీటీ రాజేందర్రావు, ప్రశాంత్‌రెడ్డి, తిరుపతినాయక్, జమీలొద్దీన్, ఆరె రవి పాల్గొన్నారు.