Korutla | కోరుట్ల, జనవరి 9: కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ చూపిన సీఐ సురేష్ బాబు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఏయిర్టెల్ నెట్ వర్క్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది పట్టణంలో పలుచోట్ల గుడారాలను ఏర్పాటు చేసుకుని సంస్థకు చెందిన సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. కోరుట్ల మొబైల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కొంతమంది సెల్ పాయింట్ నిర్వాహకులు ఏయిర్ టెల్ సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారాన్ని అడ్డుకున్నారు. కోరుట్లలో బిజినెస్ చేసుకోవాలంటే మోబైల్ ఆసోసియేషన్‌కు రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏయిర్ టెల్ డివిజన్ డిస్ట్రిబ్యూటర్ను బెదిరించారు. వీడియో కాల్ చేసి తుపాకులు, కత్తులు చూపించి భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో భయపడ్డ ఏయిర్ టెల్ సిబ్బంది రూ.30 వేలు ఆన్లైన్లో ట్రాన్జక్షన్ చేశారు. బెదిరింపులు ఎక్కువ కావడంతో ఎయిర్ టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అరుణకుమార్ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదింపులకు పాల్పడ్డ సెల్ పాయింట్ నిర్వాహకులు మార్తా శివకుమార్, బోగ శ్రీనివాస్, అడ్లగట్ట సురేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి ఒక ఏయిర్ గన్ రైఫిల్, ఏయిర్ గన్ ఫిస్టల్, తల్వార్, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. కాగా రిమాండ్‌కు తరలించే సమయంలో ముగ్గురు నిందితుల్లో ఒకరైన శివకుమార్ అస్వస్థతకు గురయ్యారు. చాతిలో నొప్పి వస్తుందంటూ తెలపడంతో పోలీసులు హుటాహుటినా స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణతో రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్సై చిరంజీవి ఉన్నారు.