మల్లాపూర్, జూన్ 6: అప్పుల భారం పెరిగిపోవడంతో కలత చెందిన వ్యక్తి ఎడారి దేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకు దెరువు కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం వేంపల్లికి చెందిన కండెల వెంకటి (41) ఉపాధి కోసం అప్పులు చేసి 15 ఏండ్ల క్రితం గల్ఫ్ బాట పట్టాడు. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ బతుకు దెరువు సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం సొంతూరికి వచ్చిన ఆయన తిరిగి వెళ్లాడు.
అయితే వేతనం అంతంత మాత్రమే ఉండడంతో వచ్చిన డబ్బులు కుటుంబపోషణ, పిల్లల చదువులకే సరిపోయేది. అయితే తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగిపోవడం.. తీర్చే దారితెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. తరచూ భార్యకు ఫోన్‌చేసి ఆవేదన వెల్లగక్కేవాడు. ఈ క్రమంలో పని చేసే చోట గురువారం ఉరేసుకున్నాడు. తోటి కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న మృతుడి భార్య రాధ, బోరున విలపించారు. కొడుకు, ఇద్దరు బిడ్డలను ఎలా సాదేదని కన్నీళ్లపర్యంత మయ్యారు. కాగా, ప్రజాప్రతినిధులు చొరవచూపి వెంకటి మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా తెప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.