వేములవాడ, ఏప్రిల్ 8 : రెండో కాన్పులో కొడుకు పుట్టాడన్న సంతోషం ఐదు రోజులకే ఆవిరైంది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని ఆరు నెలల క్రితం దుబాయ్వెళ్లిన భర్త యుద్ధంలో చిక్కుకోవడం, ఇక్కడ నవమాసాలు మోసి కన్న శిశువు దవాఖానలోనే మృతిచెందడంతో ఆమె గుండె పగిలింది. కాగా, పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా, ‘అయ్యో దేవుడా ఎంత పనిచేసినవ్’ అంటూ ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. బోయినపల్లి మండలం మాన్వాడకు చెందిన అనూషకు కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన పర్శరాములుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం మూడున్నరేండ్ల కొడుకు ఉన్నాడు. పర్శరాములు ఉపాధి నిమిత్తం కొన్నేండ్లుగా దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వచ్చి వెళ్లాడు. ఈ క్రమంలో అనూష రెండో ప్రసవం కోసం గత శుక్రవారం వేములవాడ ఏరియా దవాఖానలో చేరింది. శనివారం ఆపరేషన్ చేయగా, 2.75కిలోల బరువు ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే శిశువు ఆరోగ్యాన్ని రెగ్యులర్‌గా చెక్ చేయాల్సి ఉండగా, ఆదివారం సెలవు కావడంతో వైద్యులు పరిశీలించలేదు. సోమవారం ఒంటి గంటకు వైద్యులు రాగా, శిశువు గొంతు చిన్నగా ఉన్నట్లు అనిపిస్తున్నదని, ఆయాస పడుతున్నాడని అనూష చెప్పింది. వైద్యులు పరిశీలించి, ఏం కాలేదని సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వైద్యులు వచ్చి బాబుకు జాండీస్ ఉందని చెప్పి ఫొటో థెరపీలో పెట్టారు. కానీ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు చూడగా బాబు కదల్లేదు. అకడే ఉన్న సిబ్బంది వచ్చి చనిపోయినట్టుగా నిర్ధారించారని చెబుతూ బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సరైన వైద్యం అందకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లే శిశువు మృతి చెందాడంటూ అనూష మామ దేవయ్య దవాఖాన సూపరింటెండెంట్ రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల్లో ఆకస్మిక మరణానికి సంబంధించి సిండ్రోమ్స్ ఉంటాయని, ఇవి చాలా అరుదుగా జరుగుతాయని సీనియర్ పిల్లల వైద్యుల నిపుణురాలు డాక్టర్ సుభాషిణి తెలిపారు. అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న తండ్రి పర్శరాములు విషయం తెలిసి కుమిలిపోయాడు. ఇక్కడకు రాలేక కన్నీటి పర్యంతమయ్యాడు.