అవకాశం కోసం ఎదురి చూడకుండా వారే అవకాశం సృష్టించుకున్నవారే విజయతీరాలకు చేరుతారనే సత్యాన్ని ఈ యువకులు నిరూపిస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తనకు నచ్చిన రంగంలో రాణిస్తూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. అనుభవం నేర్పిన పాఠాలతో కొత్తగా ఆలోచించి ఒకరు పరిశ్రమ రంగంలో రాణిస్తే.. మరొకరు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధిని పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
– ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 5
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 5 : తాను పనిచేసిన రంగంలోనే అనుభవాన్ని సంపాదించి అదే రంగంలో పెట్టుబడి పెట్టి పది మందికి ఉపాధినిచ్చేలా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టకు చెందిన గుగులోత్ నరేశ్ ‘రంగుల’ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుగులోత్ నరేశ్ బతుకుదెరువు కోసం 2009లో మస్కట్‌లోని కెమ్జీ రామ్‌దాస్ పెయింట్ కంపెనీలో పెయింట్‌ను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్‌గా పనిచేసి పట్టు సాధించాడు. 2011లో ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ సాధించి 2017లో స్వదేశానికి వచ్చి హైదరాబాద్‌లో మరో పెయింటింగ్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. రెండేళ్లు పెయింట్ డిస్ట్రిబ్యూటర్‌గా అనుభవం పొందిన తర్వాత సొంతంగా పెయింట్ ప్రొడక్ట్స్ తయారు చేసే యూనిట్‌ను తన సొంత గ్రామంలో మొదలు పెట్టాలని భావించాడు. రూ.40లక్షల పెట్టుబడితో ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో 2023 జనవరిలో సొంత యూనిట్‌ను స్థాపించాడు.
ఇతర జిల్లాలకు పెయింట్ ప్రొడక్ట్స్
పెయింట్స్ ప్రొడక్ట్స్ తయారీకి నాలుగు రకాల సున్నం బస్తాలు, 15 రకాల కెమికల్స్‌ను ఉపయోగిస్తుండగా సున్నం బస్తాలను అహ్మదాబాద్, ముంబై, కేరళ, చెన్నై, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుని పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. ఇందులో ప్రైమర్, ఎమర్షన్, సీలింగ్వైట్, స్ట్రక్చర్, పుట్టి, లప్పం తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో తన ఉత్పత్తులు అమ్ముడవుతుండడంతో తాను ఉపాధి పొంది పదిమందికి ఉపాధినిచ్చేలా ఉన్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
వ్యవసాయంలోనే అనుబంధ వృత్తి
వ్యవసాయంలోనే అనుబంధంగా యూనిట్‌ను ప్రారంభించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు అక్కపల్లికి చెందిన జంకె శ్రీధర్‌రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన జంకె శ్రీధర్‌రెడ్డి 2017లో తన పొలంలో ఓ షెడ్డును నిర్మించి 10 మేకలను తెచ్చి అందులోనే నాటు కోళ్లను పెంచడం ప్రారంభించాడు. ఓ వైపు తన ఆరెకరాల్లో వ్యవసాయ పనులు చేస్తూనే మరో వైపు ఉదయం, సాయంత్రం ఓ గంట సమయాన్ని మేకల పెంపకం కోసం కేటాయిస్తూ లబ్ధి పొందుతున్నాడు. 2019 నుంచి ప్రతి దసరాకు గ్రామస్తులు తన వద్ద నుంచి మేకలను కొనుగోలు చేస్తుంటారని అలాగే నాటు కోళ్లు సైతం పెంచి అమ్ముతున్నట్లు తెలిపాడు. నెలకు సుమారు రూ.20వేలు అనుబంధ వ్యవసాయం నుంచి పొందుతున్నట్లు చెప్పాడు. 10 మేకలతో ప్రారంభించిన షెడ్డులో ప్రస్తుతం 50మేకల వరకు ఉన్నట్లు చెప్పాడు. వాటి ఎరువు సైతం తమ పొలంలోనే వాడుతున్నామన్నాడు.