జీఎస్టీ బోగస్ దందా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల వరకు దందా జరిగినట్టు తెలుస్తుండగా.. అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న జగిత్యాలకు చెందిన చంద సాయితోపాటు పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.
మరికొంత మందిని సైతం అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుండగా, తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ జిల్లాలకు పాకినట్లుగా తెలుస్తుండగా.. అందులో చాలా మంది ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగా ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంగా జరిగిన జీఎస్టీ బోగస్ బిల్లుల వ్యవహారంలో బైర్లు కమ్మే నిజాలు బహిర్గతమవుతున్నాయి. తవ్విన కొద్దీ రూ.కోట్లలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా ఇప్పటికే 300 కోట్ల వరకు ఈ బోగస్ బిల్లుల దందా జరిగినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, లోతుగా తవ్వుతున్న కొద్దీ అధికారులే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
నిజానికి ఈ వ్యవహారంలో జగిత్యాలకు చెందిన చంద సాయి అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారుడిగా భా విస్తున్నారు. అతను గతంలో జగిత్యాలలోని ఒక టాక్స్ కన్సల్టెంట్ వద్ద పనిచేసి, అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ టాక్స్ కన్సల్టెంట్ వద్ద పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పలు ఫర్మ్‌ల పేరిట ఈ దందా నడుపుతున్నట్లుగా గుర్తించారు.
కన్సల్టెంట్ల వద్దకు ఫర్మ్ క్లోజింగ్‌కు వచ్చే వారిని గుర్తించి, సదరు ఫోన్‌నంబర్లు, మెయిల్ ఐడీలు మార్చి.. ఈ దందా సాగిస్తున్నారని తేల్చారు. ఇప్పటికే ప్రాథమికంగా 30 ఫేక్ ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్టు గుర్తించడంతోపాటు పూర్తి విచారణ చేస్తున్నారు. లక్షల్లో జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిన వారికి బోగస్ టాక్స్ ఇన్వాయిస్ (బిల్లులు)లు ఇస్తూ పెద్ద దందా నడిపినట్టు తెలుస్తున్నది. జీఎస్టీ చెల్లించకుండా ఉండేందుకు కొంత మంది ట్రేడర్లు, కాంట్రాక్టర్లు వంటి వివిధ వర్గాలకు ఈ బిల్లులు ఉపయోగపడుతుండగా, మరి కొంత మంది ఈ బోగస్ బిల్లులు పెట్టి డబ్బులను ప్రభుత్వం నుంచి క్లెయిం కూడా చేసినట్టుగా తెలుస్తున్నది.
తాజాగా అందుతున్న వివరాలను చూస్తే.. ఈ బోగస్ బిల్లుల దందా దాదాపు 300 కోట్లవరకు ఉందని తెలుస్తున్నది. అంతేకాదు, ఒకే ఫర్మ్ పేరిట దాదాపు 90 కోట్ల వ్యవహారం నడిచినట్టుగా సమాచారం అందుతున్నది. అయితే ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న చంద సాయితోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించడమే కాదు, మరికొంత మందిని సైతం అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
అయితే చందసాయి అనే ఒకే వ్యక్తి దందా నడుపడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక అధికారి హస్తం ఉందన్న సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ దిశగా సైతం అధికారులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఎక్కడా లేని విధంగా ఒక్క జగిత్యాలలో ఇంత పెద్ద బోగస్ బిల్లుల దందా నడువడం, ఇది ఉన్నత స్థాయి అధికారులు గుర్తించే వరకు కింది స్థాయి అధికారులు గుర్తించకపోవడం చూస్తే అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఒక అధికారి కొంత మంది ఆడిటర్లతో కుమ్మక్కై ఈ దందాకు పరోక్షంగా సహకరించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఒక వైపు విచారణ చేస్తున్న అధికారులు, మరోవైపు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని హైదరాబాద్ అధికారులకు అందిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ విషయంపై కరీంనగర్ డివిజన్ సంయుక్త అధికారి రవికుమార్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా, ఇంకా విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. ఇప్పుడే ఏమీ జరిగిందన్న విషయాన్ని పూర్తిగా చెప్పలేమని, వివరాలు పూర్తిగా బయటకు రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు.