వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఓవైపు తాగునీరు, మరోవైపు సాగునీటి ఎద్దడి మొదలైంది. శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో జిల్లా ప్రజానీకం పరేషానవుతున్నది. ఆయకట్టు, ఆయకట్టేతర మండలాల్లో కూడా పరిస్థితులు ఒకే విధంగా ఉండడంతో, నడిఎండల్లో నీటి లభ్యత ఎలా ఉంటుందోననే జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కలెక్టరేట్, ఫిబ్రవరి 23: గతేడాదితో పోల్చితే జిల్లాలో సగటు నీటి నిల్వ మీటరుకు పైగా దిగువకు పడిపోయింది. రాబోయే రోజుల్లో మరింత అడుగంటే సూచనలు కనిపిస్తుండగా, తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడం తథ్యమనే అభిప్రాయాలు అధికారుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు కురిసినా జలాన్ని ఒడిసిపట్టడంలో ప్రభుత్వ ఘోరవైఫల్యం వేసవిలో నీటి ఎద్దడితో స్పష్టమవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఏనెలకానెల తగ్గుతున్న భూగర్భజలాల గణాంకాలు మున్ముందు రాబోయే నీటి కొరతకు సంకేతాలవుతున్నా, పాలకులు, యంత్రాంగం చోద్యం చూస్తుండడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రోజురోజుకూ తాగు, సాగునీటి అవసరాలు పెరుగుతుండగా, ఈవేసవిలో నీటి అవసరాలు మరింత పెరుగుతాయని అంచనావేస్తున్న యంత్రాంగం, ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఏప్రిల్ వరకు సమస్య జటిలమయ్యే ఆస్కారమున్నట్లు స్పష్టమవుతున్నది.
గతేడాది డిసెంబర్లో జిల్లా సగటు నీటి మట్టం 6.12 మీటర్లు దిగువన ఉండగా, ఈఏడాది జనవరిలో 7.01 మీటర్లకు పడిపోయింది. అంటే నెలలోపే సగటున 0.89 మీటర్ల దిగువకు నీరు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే నీటి మట్టంలో తేడా లేకపోగా, మిగతా 11 మండలాల్లో నీటిమట్టం దిగువకు చేరుతున్నట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వరుసగా రెండో వేసవిలో కూడా నీటి ఎద్దడి సమస్య ఉమ్మడి రాష్ట్రంలో జిల్లావాసులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుకు తెచ్చేలా ఉందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. సీమాంధ్రుల పాలనలో కొన్నేళ్లపాటు యాసంగిలో క్రాప్ హాలీడేలు కూడా ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాబోయే రోజుల్లో తిరిగి అవి పునరావృతమవుతాయేమోననే ఆందోళన జిల్లా ప్రజానీకంలో నెలకొన్నది.
తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలను తలపించగా, నడి ఎండాకాలంలో సైతం ‘కాళేశ్వరం’ జలాలు మెట్టప్రాంతాల ప్రజల కాళ్లు కడిగాయి. ఒక్క తడి కూడా తక్కువ కాకుండా యంత్రాంగం నీటి విడుదల చేసేలా చర్యలు తీసుకునేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలను ముందుగానే ఎత్తిపోసి ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు చేయడంపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టేది. దీంతో, భూగర్భ జలాలు పైకి ఉబికివచ్చి, వేసవిలో సైతం వ్యవసాయ బావుల్లో భూమికి మీటరు దిగువలోనే నీటి నిల్వలుండేవి. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయడంపై చూపుతున్న నిర్లక్ష్యంతో జలం పాతాళానికి చేరిందనే చర్చ జిల్లాలో నడుస్తున్నది. ఈ క్రమంలో నీటి ఎద్దడి నివారణకు తీసుకునే ప్రత్యామ్నాయ చర్యల కోసం వేచిచూడాల్సిందేనని అధికారులే పేర్కొంటుండడం గమనార్హం.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 23: వేసవి ఆరంభం కాక ముందే ఎండల తీవ్రతకు కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని (గుండి) నగునూర్, ఇరుకుల్ల వాగులు ఎడారిని తలపిస్తున్నాయి. వాగులోని వ్యవసాయ బావుల్లోనూ నీరు అడుగంటడంతో సమీప ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజ్వయర్ నుంచి గుండివాగు ద్వారా (నగునూర్, ఇరుకుల్లవాగు)లోకి నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు అధికారులను కోరుతున్నారు.