మెట్పల్ల్లి, మార్చి10: రోజురోజుకూ పతనమవుతున్న పసుపు ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సైతం ఎల్లని పరిస్థితుల్లో మద్దతుధర కోసం పోరుబాట పడుతున్నారు. పసుపు రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘నేడు చలో మెట్పల్లి’ పిలుపునిచ్చారు. పలు డిమాండ్లతో మెట్పల్లిలో ఉదయం 10 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి జాతీయ రహదారి మీదుగా పాత బస్టాండ్ వరకు మహార్యాలీ తలపెట్టారు. ఇప్పటికే రైతు ఐక్యవేదిక నాయకులు మహార్యాలీని విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేశారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలతో పాటు కథలాపూర్, మేడిపల్లి, జగిత్యాల, పొరుగున ఉన్న నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కమ్మర్పల్లి, ఏర్గట్ల, ఖానాపూర్, లక్ష్మణచందా, మామడ తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు మహాధర్నాకు తరలిరానున్నారు.
డిమాండ్లు ఇవే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎంఐఎస్ (మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం) కింద మద్దతు ధర క్వింటాల్‌కు 15 వేలు ప్రకటించాలి. ప్రభుత్వ ఏజెన్సీతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనాలి. మార్కెట్ యార్డులో సిండికేట్‌గా ఏర్పడి పసుపు ధరను తగ్గిస్తున్న దళారులను గుర్తించి, వెంటనే వారి లైసెన్స్‌ను రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి.
మహాధర్నాకు తరలిరండి
మెట్పల్ల్లి, మార్చి10: మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరం అండగా నిలుద్దామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. సోమవారం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కుప్పలను పరిశీలించారు. పసుపు రైతులతో మాట్లాడి ప్రస్తుతం మార్కెట్లో ధరల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మద్దతు ధర కోసం 11న రైతులు చేపట్టిన మహార్యాలీ, ధర్నాకు రాజకీయాలకతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో రైతులకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్న నాయకులను నిలదీయాలని సూచించారు.
పసుపు బోర్డుతో మేలు జరుగుతుందని ఆశించిన పసుపు రైతులకు తీరా కనీసం పంట ఉత్పత్తికి గిట్టుబాటు ధర లభించడం లేదని, గతేడాదితో పోల్చితే ఈ సీజన్లో సగానికిపైగా ధరలు పడిపోయానన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప బోర్డుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. పసుపు బోర్డు పేరుతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, క్వింటాల్ పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేశాయన్నారు. రైతుల సమస్యలపై తాను కోరుట్ల నుంచి జగిత్యాలకు చేపట్టిన పాదయాత్రకు మించి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి ఈ మహార్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు పీసు తిరుపతిరెడ్డి, సాగర్,దారిశెట్టి రాజేశ్, ఆరేళ్ల రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.