పంద్రాగస్టు వేడుకలు ఉమ్మడి జిల్లాలో కనుల పండువలా జరిగాయి. గురువారం ఊరూవాడా పతాకావిష్కరణ చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల పతాక ఆవిష్కరణల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కరీంనగర్, ఆగస్టు 15(నమసే తెలంగాణ) / కలెక్టరేట్/ కమాన్ చౌరస్తా : స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడనా త్రివర్ణ పతాకాలు ఎగిరాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీలు, సంఘాల కార్యాలయాలు, విద్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో బాధ్యులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రధానంగా జిల్లాకేంద్రాల్లో అధికారిక వేడుకలను కనులపండువలా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విప్ అడ్లూరి లక్షణ్‌కుమార్, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద పాల్గొని, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయాచోట్ల పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వివిధ వేషధారణలతో.. త్రివర్ణ పతాకాలతో భారతమాతను, స్వాతంత్య్ర సమరయోధులను కీర్తిస్తూ చిన్నారులు నృత్యాలు చేస్తూ, నాటికలు ప్రదర్శిస్తూ అకట్టుకున్నారు.
మేం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే అభయ హస్తం హామీల్లో ఒక్కొక్కటీ అమలు చేస్తున్నాం. సంక్షేమంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య పరిమితిని పెంచాం. మహాలక్ష్మీ పథకం కింద 500లకే వంట గ్యాస్ ఇస్తున్నాం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత సరఫరా చేస్తున్నాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం.
-కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇంకా ప్రజల సమస్యల పరిషారంలో ముందున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సహాయ పరిమితిని పెంచింది. మరిన్ని వ్యాధులను చేర్చి మొత్తం 1675 రకాల జబ్జులకు చికిత్సలకు అందిస్తున్నది.
– జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
మాది ప్రజాప్రభుత్వం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సబ్బండవర్గాలకు అండగా నిలుస్తున్నాం. దేశంలో ఎన్నడూ జరుగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసి రైతుల కండ్లలో ఆనందాన్ని నింపాం. రైతు కూలీలకు ఏడాదికి 12వేల ఆర్థిక సాయం అందించే పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రకృతి వైపరీత్యాల టైంలో రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం.
– సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రైతుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాఫీ చేస్తున్నది. వానకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒకొకటిగా అమలు చేస్తున్నాం.
– పెద్దపల్లిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద
రైతుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాఫీ చేస్తున్నది. వానకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒకొకటిగా అమలు చేస్తున్నాం.
– పెద్దపల్లిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద