Collector Koya Sri Harsha | పెద్దపల్లి, ఆగస్టు29: సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల పరిధిలోని 2432 వార్డులలో 4,04,209 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న (గురువారం) విడుదల చేశామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీ వారిగా డ్రాప్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 లోపు తెలియజేయాలని, 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామని చెప్పారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2432 డ్రాప్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేశామని, వీటిపై అభ్యంతరాలను ఈనెల 30 లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో వీర బుచ్చయ్య, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.