చొప్పదండి/ కరీంనగర్ రూరల్/గన్నేరువరం, మే 8: రైతన్న గుండె చెరువైంది. కాంగ్రెస్ సర్కారు తీరుతో తీరని దుఃఖమే మిగులుతున్నది. మొన్న యాసంగిలో పంటలకు నీరందించకపోవడంతో వందలాది ఎకరాలు ఎండిపోగా, తాజాగా కొనుగోళ్లలో చూపిన నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలైంది. పది, ఇరువై రోజు కింద నుంచే కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా.. కొనుగోళ్లలో జాప్యం చేయడం రైతులను నిండా ముంచింది. రెండ్రోజుల కింద కురిసిన అకాల వానతో సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. పలుచోట్ల వరదకు కుప్పలకు కుప్పలే కొట్టుకుపోగా, రెక్కల కష్టం కండ్ల ముందే నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వాన నుంచి కాపాడుకునేందుకు మొన్న అష్టకష్టాలు పడ్డారు. నిన్న ఎక్కడ చూసినా తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ.. నేర్పుతూ.. సంచుల్లో నింపుతూ కనిపించారు. ఎవరిని కదిలించినా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆరుగాలం శ్రమ నీటిపాలైందని గొడగొడ ఏడుస్తూ చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇవాళ తాము నష్టపోవాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. వెనువెంటనే కొంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సర్కారే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సర్కారు నిర్లక్ష్యంతోనే వడ్లు నీళ్లపాలు
నేను పది రోజుల కిందే చొప్పదండి వ్యవసాయ మారెట్కు 20 క్వింటాళ్ల వడ్లు తెచ్చిన. తొందర్నే కొంటరని సంబురపడ్డ. కానీ ఒక్క రోజు పోయింది. రెండ్రోజులు దాటినయి. అయినా కొనలేదు. ఏవేవో కారణాలు చెప్పిన్రు. ఇంకేం చేస్తం? పొద్దుగాల ఆరబోసుడు, రాత్రి కుప్పలు చేసేతందుకే మా పని అయిపోయింది. తీరా పది రోజుల తర్వాత సంచులు నింపితే మంగళవారం కురిసిన అకాల వానకు ధాన్యం తడిసిపోయింది. అధికారులు వచ్చి ఆ సంచులను ఆరబెట్టాలని అంటున్నరు. టైంకు బార్దాన్లు, కాంట ఇవ్వక జాప్యం చేసుడుతోనే మేం నష్టపోయినం. గత పదేండ్లల ఇలా ఎప్పుడూ జరుగలే. వెంట వెంటనే ధాన్యం కొన్నరు. పైసలు ఇచ్చిన్రు. ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మాకీ కష్టం వచ్చింది. తడిసిన ధాన్యాన్ని కొనాలి.
– కచ్చు సతీశ్, రైతు (చొప్పదండి)