కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు తుది అంకానికి చేరింది. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతుండగా, నిన్నటిదాకా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం హోరెత్తింది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుండగా, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈనెల 27న ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ రోజు నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించగా, 13న ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది బరిలో నిలిచారు. ఈ నెల 27న ఎన్నికలు ఉండగా, అభ్యర్థులంతా ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికే రెండు విడతలుగా ప్రచారం పూర్తి చేసిన ప్రధాన అభ్యర్థులంతా, మరింత దూసుకెళ్లారు. గెలుపుపై దృష్టి సారించి, నాలుగు ఉమ్మడి జిల్లాలు తిరుగుతున్నారు. నేరుగా ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు.
టీచర్లు, గ్రాడ్యుయేట్ల మద్దతు కూడగడుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం.. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా, సాధ్యమైనంత మేర ఎక్కువ మంది ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి కొనసాగే సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ప్రచారం చేయకూడదని రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సైలెన్స్ పీరియడ్‌లో జిల్లాయేతర వ్యక్తులు కూడా జిల్లాలో ఉండకూడదని సూచించారు. మండలి ఎన్నికలు ముగిసే దాకా ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
ఈనెల 27 పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మొత్తం 15 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 406, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 181 పోలింగ్ కేంద్రాలతోపాటు 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. అంతేకాదు, గంట గంటకూ పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. అలాగే, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని సదరు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు.