ACB Raids | మెట్ పల్లి : వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజేష్‌ను ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లేశం అనే రైతు తన పట్టా పాస్ పుస్తకంలో పేరు తప్పుగా పడింది.
దీంతో దానిని సవరించాలని కొద్ది రోజుల క్రితం స్థానిక అతడు జీపీవోను సంప్రదించాడు. అందుకు జీపీవో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5వేలు ఇస్తేనే పాస్ పుస్తకంలో పేరును సవరిస్తామని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో మరో మార్గం లేక సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు గురువారం తన జేబులో నుంచి రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.