Ration card holders పెగడపల్లి: ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మండలంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి ప్రొసిడింగ్ పత్రాలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తానని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి లక్ష్మణ్‌కుమార్ వివరించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో రేషన్ కార్డుల కోసం 40 వేల దరఖాస్తుల రాగా, ఇప్పటి వరకు 35 వేల కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు.
పెగడపల్లి మండలానికి సంబందించి 1630 దరఖస్తులు రాగా, ఇప్పటి వరకు 1080 కార్డులు మంజూరు చేశామని, అర్హులకు త్వరలోనే మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్ గౌడ్, డీఆర్డీవో రఘువరన్, అడిషనల్ పీడీ సునీత, తహసీల్దార్ రవీందర్, ఎంపీడివో శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములగౌడ్, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, ఏపీఎం సమత, నాయకులు శోభారాణి, శ్రీనివాస్, మల్లారెడ్డి, తిరుపతి, కిషన్, బాస్కర్, ప్రశాంత్, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.