వేసవి సెలవుల తర్వాత గురువారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, మోజార్టీ చోట్ల ‘సమస్యల’ స్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగినా.. ప్రస్తుతం చాలాచోట్ల అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని చోట్ల తరగతి గదులు, వంటశాలలు దెబ్బతిన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహణ లేక మూతపడిపోయాయి. నిర్వహణ లేక పాఠశాలల ఆవరణలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఇన్ని సమస్యల నడుమ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారిని పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 11: వేసవి సెలవులకు సెలవిస్తూ, నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా, సర్కారు బళ్లలో సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. సెలవుల ప్రారంభం నుంచే స్కూళ్లలో సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకున్నా, అవి సాధ్యం కాలేదని తెలుస్తున్నది. ఈ విషయంలో కలెక్టర్ సైతం పలుసార్లు అధికారులను ఆదేశించినా, పాఠశాలలను పరిశీలించినా, పాఠశాలలు తెరుచుకునే రోజు వరకు పనులు పూర్తికాని పరిస్థితి ఉంది.
ఎటూ చూసినా అసౌకర్యాలే
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో మగ్గుతున్నాయి. ఎటు చూసినా అసౌకర్యాలే కనిపిస్తున్నాయి. కరీంనగర్‌లోని పాత బైపాస్‌లోని దుర్గమ్మగడ్డ హైస్కూల్ భవనం పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, 2023 నవంబర్ నుంచి ఆ పనులను కాంట్రాక్టర్ చేపట్టడంలేదు. అయితే, ఆ పాఠశాల ప్రస్తుతం వసతులు లేని శిథిలావస్థలో మగ్గుతున్న అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.
అద్దె భవనంలో ఉన్న పాఠశాలలను మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ సందర్శించగా, దుర్గమ్మగడ్డ పాఠశాలలో నీళ్ల ట్యాంక్‌ను విద్యార్థులు కడుగుతూ కనిపించారు. అక్కడే ఉన్న అశోక్‌నగర్ ఉర్దూ మీడియం స్కూల్ పాఠశాలను రంగులు వేసి ముస్తాబు చేసినా, ఆ పాఠశాల ఎదుట ఉన్న గొయ్యి ప్రమాదకరంగా ఉంది. నగరంలోని కార్ఖానగడ్డ హైస్కూల్ ఏటా అడ్మిషన్లతో నిండిపోతున్నా, సరిపడా తరగతి గదులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో బోర్ పాడైపోయింది. తరగతి గదుల్లో ఫ్యాన్లు పూర్తిగా విరిగిపోయి ఉన్నాయి.
బడిబాటతో ప్రయోజనం శూన్యమే!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఊరూరా విస్తృత ప్రచారం చేశారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
అయితే పాఠశాలలు అధ్వానంగా ఉండడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం పట్టింపులేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు పెద్దగా ఆసక్తి చూపనట్టు తెలుస్తున్నది. ఈ సారి పిల్లల సంఖ్య పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో చూస్తే గతేడాది 651 ప్రభుత్వ పాఠశాలల్లో 30,081 మంది పిల్లలు అభ్యసించినా.. ఈ సంఖ్య ఈ యేడాది తగ్గే అవకాశం కనిపిస్తున్నది.
ప్రీ ప్రైమరీలో విద్యార్థులు వచ్చేరా..?
ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం పలు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నది. అయితే కరీంనగర్ జిల్లాలో మూడు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను గురువారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎంపీపీఎస్ మామిడాలపల్లి, ఎంపీపీఎస్ ఇప్పలపల్లి, ఎంపీపీఎస్ బిజిగీరిషరీఫ్కు పాఠశాలలను ఎంపిక చేయగా, ఇక్కడ చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని ప్రత్యేక సెలబస్ ద్వారా బోధించనున్నారు. అయితే, బుధవారం ఉత్తర్వులు వెలువడడం, గురువారం నుంచి తరగతులను ప్రారంభించాలని సూచించడడంతో అప్పటికప్పుడు విద్యార్థుల అడ్మిషన్లు ఎలా వస్తాయోననని, ఇది సాధ్యమయ్యే పనేనా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.